సన్నాలపై బీజేపీ, బీఆర్ఎస్​ యూటర్న్​!

సన్నాలపై బీజేపీ, బీఆర్ఎస్​ యూటర్న్​!
  • నాడు ఉప్పుడు బియ్యం తీసుకోబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు
  • సన్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు
  • అసలు దొడ్డు వడ్లే వేయొద్దన్న గత బీఆర్​ఎస్​ సర్కార్​
  • సన్నవడ్లకు రూ. 100 బోనస్​ ప్రకటించి మొండిచేయి
  • ఇప్పుడు బోనస్​తో సన్నాలను ప్రోత్సహిస్తుంటే విమర్శలు

హైదరాబాద్​, వెలుగు: సన్న వడ్లకు బోనస్​పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయ రంగును పులుముతున్నాయి. ఇదే సన్నరకం వడ్లపై మొన్నటి దాకా ఒక మాట మాట్లాడిన పార్టీలు.. ఇప్పుడు యూ టర్న్​ తీసుకున్నాయి. పైగా వానాకాలం సీజన్​ మొదలయ్యే టైంలో రైతులను కన్​ఫ్యూజ్​ చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్​ వరిలో ఫైన్​ వెరైటీలను (సన్నరకం) ప్రోత్సహించాలని పదే పదే తెలంగాణకు లెటర్లు రాసింది. ఇప్పటికీ కేంద్రంలోని వ్యవసాయ శాఖ, ఎఫ్​సీఐ కూడా ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతులు చేసుకునేలా ఫైన్​ వెరైటీ వడ్ల సాగుకు ఊతం ఇవ్వాలని చెప్తున్నాయి.

కానీ ఇక్కడ కేంద్రమంత్రి, బీజేపీ లీడర్లు బోనస్​ ఇవ్వడాన్ని తప్పు పట్టడంపై విమర్శలు వస్తున్నాయి.  ఇక ఐదు నెలల కిందటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ కూడా 2020 అక్టోబర్​లో ఇదే సన్న రకాలకు క్వింటాకు రూ.100 లేదా రూ. 150  బోనస్ ఇచ్చే యోచన ఉందని​ ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. అసలు వరి సాగు చేయొద్దని.. వరి వేస్తే ఉరి అని 2022లో అప్పటి సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

ఒకవేళ సాగు చేసినా సన్నాలే వేసుకోవాలన్నారు. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్​ షాపుల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు, ఇటు సన్నవడ్ల సాగు చేసే రైతులకు మంచి ధర ఇప్పించి లాభాలు వచ్చేలా చేసేందుకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ ప్రకటించగా విమర్శలు చేస్తుండడంపై ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

 మొన్నటి దాకా అధికారంలో ఉన్నప్పుడు సన్నవడ్ల సాగు పెంచాలని చెప్తూ వచ్చినోళ్లు.. ఇప్పుడు ప్లేట్​ ఫిరాయించి కామెంట్స్​ చేయడంపై వారు ఆశ్చర్యపోతున్నారు. అటు వినియోగదారులకు, ఇటు రైతులకు లాభం జరగాలంటే సన్న రకాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సెక్రటేరియెట్​లోని ఓ ఉన్నతాధికారి అన్నారు.  

అప్పుడు సన్నాలకే బోనస్​ ఇస్తమని చెప్పి..!

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు సన్న వడ్లకు కేసీఆర్​ బోనస్​ ఇస్తామని ప్రకటించారు. జనగామ జిల్లా కొడకండ్ల రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘సన్న వడ్లు వెయ్యుండ్రయ్యా.. మార్కెట్ల మంచిగుంటదని నేనే చెప్పిన. ధర దొరుకుతదని చెప్పిన. దొరికిపిస్తం. ఎట్ల దొరకది.. గ్యారంటీగా ధర వచ్చేట్లు చేస్త. సన్న వడ్లకు నూరు నూట యభయన్నా ఎక్కువ రావాలె. గామాత్రం బోనస్​ అయిన ఇస్తం’’ అని నాడు సీఎం హోదాలో కేసీఆర్​ చెప్పారు. అయితే ఒక్క రూపాయి బోనస్​ కూడా రైతులకు ఇవ్వలేదు.  

ఆతర్వాత యాసంగిలో బాయిల్డ్ రైస్​ పైనా మాట్లాడినప్పుడు కూడా దొడ్డు వడ్లు వేసుకోవద్దని.. అసలు వరే వేయొద్దని, వరి వేస్తే ఉరి అంటూ 2022లో  నాటి బీఆర్​ఎస్​ సర్కార్​ కామెంట్లు చేసింది. ఇప్పుడు అదే బీఆర్​ఎస్​ లీడర్లు వడ్ల బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా రైతాంగాన్ని ఏకం చేసి పోరాడతామని కామెంట్స్​ చేయడంపై రైతుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో అవసరాల మేరకు సన్నాల సాగు పెంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని కాంగ్రెస్​ చెప్తున్నది. ఒకప్పుడు బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రకటించిన బోనస్​కు అదనంగా తాము రూ. 500కు పెంచి ఇస్తామంటే ఎందుకు ఉలికి పడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. 

ఫైన్​ వెరైటీలు, బోనస్​పై కేంద్రం అట్లా.. రాష్ట్ర బీజేపీ ఇట్లా​

సన్న వడ్ల సాగుపై కేంద్ర ప్రభుత్వం, ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ) ఒకటి చెప్తుంటే.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించిన సన్నాలకు రూ.500 బోనస్​పై విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దొడ్డు రకం బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో ఒకవైపు కేంద్రం, ఎఫ్​సీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019–20 నుంచే అంటే దాదాపు నాలుగేండ్ల కిందటి నుంచే సన్నరకం వడ్ల సాగును ప్రోత్సాహించాలని తెలంగాణకు  కేంద్రం సూచిస్తూ వస్తున్నది.  

రైతులతో ఫైన్​ వెరైటీలు సాగు చేయిస్తే మంచి గిట్టుబాటు అవుతుందని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. సన్నాల సాగు పెరిగేందుకు రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కూడా తెలిపింది. ఇదే విషయమై అప్పుడు బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు సన్నాలకు ప్రకటించిన బోనస్​ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ లీడర్లు డిమాండ్​ చేశారు. అదే కాంగ్రెస్​ ప్రకటించిన బోనస్​పై పెదవి విరుస్తూ దొడ్డు వడ్లకు కూడా బోనస్​ ఇవ్వాలని అనడంపై విమర్శలు వస్తున్నాయి. 

సన్న వడ్లకే బోనస్ ఎందుకంటే..!

ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్​ ఎన్నికల హామీల్లో తెలిపింది. అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి అధికారులతో సమావేశమై బోనస్​పై చర్చించారు. రాష్ట్రంలో సాగవుతున్న వరి, వస్తున్న ఉత్పత్తి.. రాష్ట్రంలో వినియోగమవుతున్న బియ్యంపై లెక్కలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రేషన్​ బియ్యం రీసైక్లింగ్​ దందా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు గుర్తించారు. దాంతో పాటు రేషన్​లో దొడ్డు బియ్యం తీసుకుంటున్న వారిలో 40 శాతం కూడా వాటిని తినడానికి వాడటం లేదని, నిల్వలు పెరిగిపోయాయని తేలింది.

ఇక అదే దొడ్డు రకం వడ్లను సాగు చేస్తున్న రైతులకు అనుకున్నంత గిట్టుబాటు ధర రావడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. సన్నరకం వడ్లు సాగు చేస్తే దిగుబడి రెండు, మూడు బస్తాలు తగ్గినా దొడ్డు రకం కంటే ఎక్కువ లాభాలు వస్తాయని.. దేశవ్యాప్తంగా డిమాండ్​ ఉందని, అంతదూరం ఆలోచించకపోయినా రాష్ట్రంలోనూ పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చని అధికారులు అన్నారు. సన్నాల సాగుకు రైతులు అలవాటు పడి లాభాలు గడిస్తే ఏటా వాటివైపే మొగ్గు చూపుతారన్న నిర్ణయానికి వచ్చారు. తక్కువ ధరకే సన్నబియ్యం అందివ్వాలంటే బోనస్​ ముందుగా సన్న వడ్లకు అమలు చేయాలని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు.