బీజేపీ వర్సెస్ కాంగ్రెస్: పార్లమెంట్ ఉభయ సభల్లో సాగిన మాటల యుద్ధం

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్: పార్లమెంట్ ఉభయ సభల్లో సాగిన మాటల యుద్ధం

న్యూఢిల్లీ: అపోజిషన్ పార్టీలన్ని విదేశీ శక్తులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఉభయ సభల్లో బీజేపీ మండిపడింది. కేంద్ర సర్కార్‎ను నిలదీయడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించింది. దేశ ప్రయోజనాలపై కాంగ్రెస్ దాడి చేస్తున్నదని ఫైర్ అయింది. ప్రధాని మోదీ తీసుకొచ్చిన పథకాలను విమర్శించే విదేశీ శత్రువులతో ప్రతిపక్షాలు చేతులు కలిపాయని ఆరోపించింది. ఎప్పుడూ ఇండియాపై విషం కక్కే అమెరికన్ ఇన్వెస్టర్ జార్జ్ సోరెస్‎తో రాహుల్ గాంధీకి ఏం సంబంధమని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రశ్నించారు. 

మోదీ నాయకత్వంలో దేశ పురోగతిని అణగదొక్కడానికి అంతర్జాతీయ కుట్ర పన్నారని ఆరోపించారు. దూబే కామెంట్లపై కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ అభ్యంతరం తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. దూబే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ సభ్యులు కోరారు. అదానీ ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని అపోజిషన్ పార్టీలు ఉభయ సభల్లో నిరసన తెలిపాయి. సభలు ప్రారంభమైన తర్వాత వెంటనే 12 గంటలకు వాయిదా పడ్డాయి. మళ్లీ అదే పరిస్థితి ఉండటంతో లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ శుక్రవారానికి వాయిదా వేశారు.

హింసకు ఇండియా వ్యతిరేకం: జైశంకర్

గాజా వార్‎కు ‘ద్విదేశ’ పరిష్కారానికి ఇండియా మద్దతు ఇస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టంచేశారు. క్వొశ్చన్ అవర్‎లో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ‘కాల్పుల విరమణ, హింస ముగింపునకు ఇండియా సపోర్ట్ చేస్తది. గాజా విషయంలో యూఎన్‎లో చేసిన తీర్మానాలకు ఇండియా దూరంగా ఉందన్న వార్తలను ఖండిస్తున్నాం. ఇండియా స్వయంగా టెర్రరిస్ట్ బాధిత దేశం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య వార్ ప్రారంభమైనప్పటి నుంచి యూఎన్‎లో 13 తీర్మానాలు ప్రవేశపెట్టారు. అందులో 10 తీర్మానాలకు ఇండియా అనుకూలంగా ఓటేసింది. 

మూడు తీర్మానాలకు దూరంగా ఉన్నది. జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బలమైన బంధం ఉంది. పాలస్తీనా ప్రజలకు అవసరమైన సాయం చేస్తున్నం’’ అని జైశంకర్ తెలిపారు. కాగా, ఈజ్​ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులను ఆకర్శించేందుకు 90 ఏండ్ల చట్టాన్ని రీ ప్లేస్ చేసేందుకు తీసుకొస్తున్న ‘ది భారతీయ వాయుయాన్ విధేయక్ 2024’’బిల్లుపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. అన్ని చట్టాలకు హిందీ పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చట్టాల పేర్లను ఇంగ్లీష్‎లోనే ఉంచాలని డిమాండ్ చేశాయి.  

దేశాన్ని అస్థిరపర్చే కుట్ర: బీజేపీ

అదానీ వ్యవహారంపైనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడం వెనుక విదేశీ పెట్టుబడిదారుల హస్తం ఉందని బీజేపీ విమర్శించింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలనే.. ఉభయ సభల్లో ప్రతిపక్షాలు అమలు చేస్తున్నాయని ఫైర్ అయింది. ‘‘ఇండియాకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించే గ్లోబల్ మీడియా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్​పీ)’కు అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు ఇస్తరు. సోరోస్ ఎజెండానే ఇక్కడ రాహుల్ అమలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్ సభలో ఫైర్ అయ్యారు. 

బీజేపీ చెప్పేవన్ని అబద్ధాలే: కాంగ్రెస్

బీజేపీ సభ్యులు చేసిన విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. సభను పక్కదారి పట్టించేందుకు బీజేపీ సభ్యులు అక్కర్లేని అంశాలను ప్రస్తావిస్తున్నారని, ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించింది. లోక్ సభలో బీజేపీ ఎంపీ దూబేకు ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో శాంతి స్థాపనకు రాహుల్ కృషి చేస్తున్నారని తెలిపారు.  ఆయన​పై బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దూబే తన కామెంట్లను ఉప సంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. నిజానికి పార్లమెంట్ సక్రమంగా కొనసాగాలని బీజేపీ అనుకోవడం లేదన్నారు.