నుపుర్ శ‌ర్మ‌ వ్యాఖ్యలపై అరబ్ దేశాల్లో మంటలు

నుపుర్ శ‌ర్మ‌ వ్యాఖ్యలపై అరబ్ దేశాల్లో మంటలు
  • నుపుర్ శ‌ర్మ‌, నవీన్ జిందాలపై బీజేపీ వేటు
  • అరబ్ దేశాల్లో నుపుర్ శ‌ర్మ‌ వ్యాఖ్యలపై చిచ్చు
  • నుపుర్, నవీన్ పై చర్యలకు ప్రతిపక్షాల డిమాండ్

నుపుర్ శ‌ర్మ.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. నుపుర్ రాజేసిన చిచ్చుతో అరబ్ దేశాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అందుకు కారణం మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివావాదస్పద వ్యాఖ్యలు చేసి, చిక్కుల్లో పడ్డారు. అసలింతకు ఈ నుపుర్ శర్మ ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అరబ్ దేశాలతో పాటు ప్రతిపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి. 

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ .. ఇస్లాం మ‌త వ్య‌వ‌స్థాప‌కుడు మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయడంతో సర్వత్రా విమర్శలు చెలరేగాయి. ఆర‌బ్ దేశాలు నుపుర్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించాయి. నుపుర్ కామెంట్స్ పై 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ (ఓఐసీ) భ‌గ్గుమంది. భార‌త్‌పై త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది. మరోవైపు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌ల‌ను ఖ‌తార్‌, కువైట్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కువైట్ లోని అల్ అర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ భారతీయ వస్తువుల అమ్మకాలను బహిష్కరించింది. భారత్‌లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది.

ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్‌ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్‌ చేసింది. ఇటు ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు సౌదీ విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌ క్షమాపణ చెప్పాలని ఖతార్, కువైట్‌ దేశాలు డిమాండ్‌ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్‌ అయిన గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) కూడా నుపుర్ శర్మ, జిందాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు.

భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్‌ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలు చేపట్టింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో బీజేపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. వెంటనే నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌ లెటర్‌లో ‘పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామని’ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది. ఇటు ఓఐసీ ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ తోసిపుచ్చుతూ అన్ని మ‌తాల ప‌ట్ల తమ దేశానికి అత్యంత గౌర‌వం ఉంద‌ని పేర్కొంది. ఇస్లామిక్ దేశాల స‌మాఖ్య వ్యాఖ్య‌లు సంకుచిత ధోర‌ణితో ఉన్నాయ‌ని పేర్కొంది. 

క్షమాపణలు కోరిన నుపుర్ శర్మ
బీజేపీ పార్టీ సస్పెండ్‌ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. 

అసలింతకు ఈ నుపుర్ శర్మ ఎవరు..? 
నుపుర్ శర్మ ఢిల్లీ యూనివ‌ర్సిటీలోని హిందూ కాలేజీలో ఆర్థిక‌శాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేశారు. ఢిల్లీ వ‌ర్సిటీ నుంచే ఆమె ఎల్ఎల్‌బీ కూడా చ‌దివారు. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో లా స‌బ్జెక్ట్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు. 2008లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్ యూనియ‌న్ ప్రెసిడెంట్ అయ్యారు. 2015లో జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ నేత అర‌వింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ యువ‌మోర్చాలో అనేక కీల‌క హోదాల్లో ప‌ని చేశారు. 2017లో ఢిల్లీ బీజేపీ అధికారి ప్ర‌తినిధిగా నుపుర్ శర్మ నియ‌మితులయ్యారు. 2020 సెప్టెంబ‌ర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ న‌డ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జాతీయ అధికార ప్ర‌తినిధిగా ఆమెను నియ‌మించారు. టీచ్ ఫ‌ర్ ఇండియా యూత్ అంబాసిడ‌ర్‌గా నుపుర్ శర్మ కొన‌సాగుతున్నారు. 

నుపుర్, జిందాల్ పై చర్యలకు ప్రతిపక్షాల డిమాండ్
విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ మత రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. BJP నేతల మతపరమైన వ్యాఖ్యలతో విదేశాల్లో ఉండే భారతీయుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ అవమానకర మతోన్మాదం భారతీయులను ఒంటరి చేయటమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఇండియా ప్రతిష్టను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై పార్టీపరంగానే కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల కామెంట్స్ ను ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలపై ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నుపుర్, జిందాల్ లను అరెస్ట్ చేయాలన్నారు. చర్యలకు ఇప్పటికే చాలా ఆలస్యమైందని, గల్ఫ్ దేశాలు భారత రాయబారులకు సమన్లు జారీ చేశాయన్నారు. విద్వేషాన్ని చిమ్ముతున్నందుకు దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలకు, అంతర్జాతీయ సమాజానికి భారత్ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు.

మ‌హ్మ‌ద్‌ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌ల అనుచిత వ్యాఖ్య‌ల‌ను పాకిస్తాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ఖండించారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై భార‌త్ బీజేపీ నేత‌ల విద్వేష వ్యాఖ్య‌ల‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని అన్నారు. మోదీ నేతృత్వంలో భార‌త్‌లో మ‌త స్వేఛ్ఛ‌ను అణిచివేయ‌డం, ముస్లింల‌ను వేధించ‌డం పదేప‌దే జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇప్పటికే నుపుర్ శర్మపై ముంబైలో కేసు నమోదైంది. ఆమెకు నోటీసులు ఇస్తామని ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే చెప్పారు. మరోవైపు తనకు ప్రాణాపాయం ఉందంటూ ఢిల్లీలో నుపుర్ శర్మ ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.