బాలికకు న్యాయం చేయాలంటూ రాస్తారోకో.. మీర్​పేటలో అఖిలపక్షం నిరసనల్లో ఉద్రిక్తత

మీర్​పేట్​లో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయలని డిమాండ్​చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో నందనవనం రోడ్డుపై బైఠాయించి వివిధ పార్టీల నాయకులు ఆగస్టు 22న నిరసనలు తెలిపారు. 

ఈ నిరసనల్లో కాంగ్రెస్​ కార్పొరేటర్​ ధర్పల్లి రాజశేఖర్​రెడ్డి, బీజేపీ ఇంచార్జీ సామ రంగారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. 

బాలిక కుటుంబానికి న్యాయం చేసేవరకు పోరాటం ఆపబోయేది లేదని నేతలు స్పష్టం చేశారు. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్​ చేశారు. నందనవనం ఇందిరమ్మ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని నేతలు అన్నారు. 

గంజాయి, హుక్కా తదితర వ్యసనపరులు రోజు రాత్రుళ్లు ఇక్కడ తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిరసనల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం నిరసనకారులను పోలీస్​స్టేషన్ కు తరలించారు. 

ALSO READ : లిక్కర్​ తెలంగాణ కాదు.. విజ్ఞాన తెలంగాణ కావాలి : శనిగారపు  రజనీకాంత్

కేసు పూర్వాపరాలివీ.. 

మీర్ పేటలో  గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు కత్తులతో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం మీర్ పేట పరిధిలోని తన సోదరి ఇంటికి తమ్ముడితో కలిసి బాధిత బాలిక వచ్చింది. అదేరోజు స్థానిక యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించడంతో అడ్డుకుంది. దీంతో అతడు మరో ఏడుగురితో కలిసి సోమవారం ఉదయం బాలిక సోదరి ఇంట్లోకి కత్తులతో వచ్చి బెదిరించాడు. 

గంజాయి మత్తులో ఉన్న దుండగులు ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. ఆమె తమ్ముడి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ చౌహాన్ పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.