రాజ్యసభలో డీలిమిటేషన్ లొల్లి.. కేంద్ర వైఖరిపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

రాజ్యసభలో డీలిమిటేషన్ లొల్లి.. కేంద్ర వైఖరిపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: డీలిమిటేషన్‎కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఎంపీలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‎లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నల్ల చొక్కాలు ధరించి ఆందోళన చేపట్టారు. లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పలువురు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌‌‌‌లో సీట్ల సంఖ్య తగ్గుతాయని ప్రధానంగా డీఎంకే ఎంపీలు ఫైర్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల ఉనికి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అపోజిషన్ పార్టీల ఎంపీలు డీలిమిటేషన్‎కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. డీలిమిటేషన్‎తో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించాలని పట్టుబట్టారు.

రూల్ 267 కింద పలువురు ఎంపీలు డిప్యూటీ చైర్మన్ హరివంశ్‎కు నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ వాటిని డిప్యూటీ చైర్మన్ రిజెక్ట్ చేశారు. సభను సజావుగా నడిపించేందుకు సహకరించాలని సభ్యులను ఆయన కోరారు. ఎంతకీ వాళ్లు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు..

డీలిమిటేషన్‎తో దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని పలువురు అపోజిషన్ పార్టీల సభ్యులు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా తమిళనాడు లాంటి రాష్ట్రం సీట్ల పరంగా చాలా దెబ్బతింటుందని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా జనాభా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని వివరించారు. 

డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం ఏమాత్రం సరికాదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర అని మండిపడ్డారు. లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజనకు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రూల్ 267 కింద 21 నోటీసులు అందాయని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజ్యసభలో ప్రకటించారు.