ఎన్డీయే నుంచి నితీశ్ ఎగ్జిట్ మంచి పరిణామం

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయం ఉంది. నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు రావడం, తిరిగి మహాగఠబంధన్ తో బంధంలోకి వెళ్లడం రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అతి కీలక విషయంగా అప్పుడే మీడియా వర్గాలు చర్చోపచర్చలు మొదలెట్టేశాయి. బాగానే ఉంది. హిందుత్వ రాజకీయాల నుంచి దేశానికి మోక్షం ఎప్పుడా అని ఆందోళనలో ఉన్న లౌకిక శక్తులు, పనిలో పనిగా తమ మోక్షం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్ష శక్తులు సాధారణంగానే ఎన్డీయే నుంచి నితీశ్ ఎగ్జిట్​ను మంచి పరిణామంగానే అనుకోవచ్చు. నిజమే. ఈ మూడేండ్లలో మూడు ప్రధాన విపక్ష పార్టీలు ఎన్డీయే నుంచి వైదొలిగాయి. ఇంతకు ముందు శివసేన, శిరోమణి అకాలీ దళ్, ఇప్పుడు జనతాదళ్ యునైటెడ్. ఇది సహజంగా బీజేపీ వైరి పక్షాలకు మంచి ముచ్చటే. కానీ నితీశ్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆయన రాక ఆయన కోసమా.. దేశం కోసమా అన్నది తెలుస్తుంది. ఈ సందేహం కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. 

ఉద్యమం నుంచి వచ్చిన ముగ్గురు..
నేను ఉద్యోగ రీత్యా బీహార్ లో పదేళ్లున్నాను. 1990-–2000 మధ్య కాలం అది. బీహార్ తోపాటు దేశంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్న కాలం కూడా. మండల్ కమిషన్ రిపోర్టు అమలు, రాజీవ్ హత్య, బాబ్రీ కూల్చివేత లాంటి దేశాన్ని కుదిపేసిన ఘటనలు అప్పుడు జరిగినవే. ఆ కాలంలో నేను బీహార్ లో ఎక్కువగా మూడు పేర్లు వినేవాడిని. లాలూప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్. వీరు ముగ్గురూ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుంచి వచ్చిన దళిత, బహుజన వీర కిశోరాలే. బీహార్ లో అగ్రవర్ణ అహంకార రాజకీయాలకు వీరు భరతవాక్యం పాడతారనే వార్తలు అప్పట్లో వామపక్ష లౌకిక వర్గాలకు ఆనందాన్నిచ్చేవి. కానీ గడిచిన కాలంలో ఏం జరిగిందో ఆ చరిత్ర అంతా మన ముందే ఉంది. అద్వానీ రథయాత్రను నిరోధించిన మొనగాడుగా పేరుపొందిన లాలూ యాదవ్ అతని అవినీతి ఆరోపణల నిజానిజాల మాట అలా ఉంచితే ఇప్పటికీ హిందుత్వ రాజకీయాలకు బద్ధవిరోధిగానే నిలబడ్డాడు. కానీ రామ్ విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్ పదవే పరమార్థంగా భావించి బీజేపీ పంచన పరిపరి సందర్భాలుగా తలదాచుకోవడాన్ని మరిచిపోలేం.

పదవి, ఉనికిని కాపాడుకోవడం కోసమేనా?
నితీశ్ విషయానికే వస్తే ఆయన ఎప్పుడెప్పుడు ఒక సంకీర్ణం నుంచి మరో సంకీర్ణంలోకి కొత్త కొత్త రాజకీయ సంకీర్తనలు పాడి తన ఉనికిని కాపాడుకున్నాడో వెనక్కి తిరిగి చూస్తే అతని నిబద్ధత మీద అనుమానాలు తలెత్తక మానవు. ఏం చేసినా అంతా తన కోసమే చేశాడన్న మచ్చ ఆయన మీద ఎప్పుడో పడింది. ఇప్పుడాయన రానున్న ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి అంటూ మీడియా అప్పుడే కొత్త పాట అందుకుంది. ఇదంతా ఏంటి? ఇందులో ఏమైనా వ్యూహాలు, ప్రణాళికలు ఉన్నాయా ? అన్న సందేహాలూ కలుగుతున్నాయి. మరో వైపు అందరు నితీశ్ ను స్వాగతిస్తుంటే మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి ఉద్దండ సీఎంలు మౌనమె మా భాష అని ఏవో మౌన సంకేతాలు ఇస్తున్నారు. కారణం నితీశ్ మీద నమ్మకం కుదరకే. లేదంటే ప్రధాని అభ్యర్థిత్వానికి తమకు పోటీ వస్తాడేమో అన్న భయమూ కావొచ్చు. ఇన్ని సార్లు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నవాడు మరోసారి అబౌట్టర్న్ అని గట్టిగా అరిస్తే మనం ఏమైపోవాలన్న ఆందోళన కూడా  ప్రధాన విపక్షాల్లో ఉండకపోదు. నిజమే. నితీశ్ రాజకీయ చరిత్ర అంతా ఒకసారి వాళ్లు, ఒకసారి వీళ్లు అంటూ సాగిందే. ఆయన గుడారం మార్చినప్పుడల్లా ఆయన చెప్పిన కారణాలు ఆయనకున్నాయి. కానీ ఆ కారణాల మీదే ఆయన నిలబడ్డారా అంటే లేదే. 1994లో లాలూ ప్రసాద్ తో దశాబ్దాల స్నేహం వదులుకున్నది మొదలు జనతాపార్టీ, సమతా పార్టీ, జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ ఇలా పార్టీలు పార్టీలుగా తన పరపతిని విస్తరించుకుంటూ ముందుకు కదిలాడు. అది పరపతిని విస్తరించుకోవడమా? లేక తన పదవిని, ఉనికిని కాపాడుకోవడమా? ఏది ఏమైనా ఆయన ఎప్పుడు ఏ సాకుతో ఒకరిని వదిలి మరొకరితో జత కట్టాడో, దానికి ఆయన కట్టుబడలేదనేదే చరిత్ర చెప్పిన నిజం.

పాపం తేజస్వీ..
మరి తేజస్వి యాదవ్ భవిష్యత్తు ఏంటి? 2015లో నితీశ్ కి చుక్కులు చూపించాడు. వెంట్రుక వాసిలో సీఎం పదవికి దూరమయ్యాడు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అతనికే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలాంటి టైమ్​లో ఏదో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది కదా అని సంబరపడిపోవడం తేజస్వికి కలిసొచ్చే కాలంలో వికటించిన పరిణామమే అనుకోవాలా? వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. అవన్నీ ప్రధాని అభ్యర్థి విషయంలో ఒక తాటి మీదకు రావాలి. నితీశ్ విషయంలో సర్వామోదం కుదరాలి.  అంతా జరిగి విపక్షం విజయ పథంలో పయనించాలి. అప్పుడు కదా, బీహార్ లో తేజస్వికి సీఎం పీఠాన్ని అధిష్టించే అవకాశం దక్కేది? నాలుగు సీట్లొచ్చినా ప్రధాని పదవికి బేరం పెట్టే మాయావతంసులున్న విపక్ష వర్గీయుల్లో సర్దుబాట్లు బెడిసి కొట్టి తిరిగి మోడీ సేననే విజయం వరిస్తే నితీశ్ బీహార్ ను వదులుతాడా? అప్పుడు తేజస్వి పరిస్థితి ఏంటి? ఇలా ఆలోచిస్తే ‘పాపం తేజస్వి’ అనిపిస్తుంది. అయినా వేచి చూద్దాం కాలం ఏం తీర్పు చెబుతుందో అనే పాయింట్ దగ్గరే ప్రస్తుతానికి ఆగుదాం. 


ప్రతిపక్షాలు నమ్మడం లేదా?
2014 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించినందుకు 2013లో నితీశ్​ ఎన్డీయే నుంచి వైదొలగాడు. సరే బాగుంది. విలువలున్న రాజకీయ దురంధరుడు అనుకున్నారంతా. కానీ 2017లో అదే మోడీ నేతృత్వంలోని బీజేపీతో ఎలా జతకట్టాడు? అప్పటికి మోడీ గంగా స్నానంతో  పవిత్రుడుగా కనిపించాడా? సరే కనిపించాడు పో. తేజస్వి యాదవ్ అవినీతి పెచ్చుమీరిపోతోందని, లాలూ కుటుంబ సభ్యుల మీద ఈడీ, ఐటీ దాడులు పెరిగిపోవడంతో విసిగిపోయి ఆ మహాగఠబంధనాన్ని తెంచేసుకున్నాడు కదా? మరి ఇప్పుడు అదే తేజస్వి యాదవ్ ఆ అయిదేండ్లలో ఏ యజ్ఞం చేసి పునీతుడయ్యాడని నితీశ్ భావించి ఉంటాడు? ఏతా వాతా తేలేదేమంటే ఎప్పటికి ఏది తనకు లాభదాయకమో అప్పటికా వేషం మార్చాలనేది ఆయన నీతిగా గ్రహించాలి. స్వల్ప సంఖ్యాబలంతో అధిక సంఖ్యా బలం ఉన్న వారితో జతకట్టి పదవిని నిలబెట్టుకోవడంలో నితీశ్ ని కొట్టిన వారు లేరు. ఆయనను చాలా మంది ప్రతిపక్ష నేతలు  స్వాగతించలేకపోవడానికి ఇదే కారణంగా మనం చూడాలి. 
డా. ప్రసాదమూర్తి,
సీనియర్​ జర్నలిస్ట్​