- ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 56శాతం ఓట్లు
- కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు, ఎన్నికల ఖర్చు భయంతో పోటీకి జంకుతున్న లీడర్లు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రతిపక్షపార్టీలు జంకుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 56శాతం ఓట్లు రాబట్టిన కాంగ్రెస్, ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. బీఆర్ఎస్, బీజేపీ సాధించిన ఓట్లు కేవలం 37.5శాతం కావడం, ఇప్పటికిప్పుడు ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ రెండు పార్టీల నుంచి కీలక లీడర్లెవరూ పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ఎన్నికల ఖర్చును అభ్యర్థులే భరించాలని హైకమాండ్లు చెప్తుండడం కూడా లీడర్ల వెనుకడుగుకు కారణమని భావిస్తున్నారు.
ఆ రెండు పార్టీల్లో పోటీకి వెనుకడుగు..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ నుంచి అభ్యర్థులు కరువయ్యారనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్అభ్యర్థులే గెలవడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పోటీకి సిద్ధం కావాలని ఈ రెండు పార్టీల హైకమాండ్లు పలువురు నేతలకు సూచించినా ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్ఫుల్ జోష్లో ఉన్నందున ఇక్కడ గెలవలేమని హైకమాండ్లకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ బలాబలాలు, విజయావకాశాలపై ఆరా తీస్తూ బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఆరింటిని బీఆర్ఎస్గెలుచుకుంది. అదే ఊపులో 2019లో పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అదే ఊపు కాంగ్రెస్లో కనిపిస్తోందని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ టికెట్ రేసులో గడ్డం వంశీకృష్ణ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాలను స్వీప్ చేసిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలవాలనే ప్లాన్లో ఉంది. రాజకీయంగా అనుకూల పరిస్థితులున్నా అభ్యర్థి విషయంలో రాజీపడి, ప్రత్యర్థులకు అవకాశమివ్వొద్దని హైకమాండ్ఆలోచిస్తోంది. దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని దించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీకి కాకా ఫ్యామిలీ నుంచి గడ్డం వంశీకృష్ణ ఆసక్తి చూపుతున్నారు. ఈనియోజకవర్గ అభివృద్ధిలో కాకా వెంకటస్వామి కృషి ఎంతో ఉంది.
ప్రజల్లో, క్యాడర్‌లో కాకా ఫ్యామిలీకి మంచి ఆదరణ ఉంది. ఈక్రమంలోనే వెంకటస్వామి తనయకులు వివేక్వెంకటస్వామి, వినోద్ ఇద్దరూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో వంశీకృష్ణకు టికెట్ ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలవారీగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు
నియోజకవర్గం పోలైన ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ
చెన్నూర్ 1,50,438 87,541 50,026 3,375
బెల్లంపల్లి 1,39,684 82,217 45,339 3,812
మంచిర్యాల 1,91,568 1,05,945 37,989 39,829
ధర్మపురి 1,81,690 91,393 69,354 7345
రామగుండం 1,51,416 92,227 35,433 12,966
మంథని 1,93,976 1,02,375 71,588 5,680
పెద్దపల్లి 2,07,079 1,18,888 63,780 6,312
మొత్తం 12,15,851 6,80,586(56%) 3,73,509(31%) 79,319(6.5%)