ఉత్తరప్రదేశ్ జనాభా మన దేశ జనాభాలో ఐదో వంతుకు చేరింది. జనాభా ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తులో ప్రజలకు విద్య, వైద్యం, గృహ వసతి, ఉపాధి కల్పించడం, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ రాష్ట్రం జనాభా నియంత్రణకు చట్టం తీసుకొస్తోంది. పాకిస్తాన్ జనాభా 22 .5 కోట్లయితే, యూపీ జనాభా 24 .10 కోట్లకు చేరింది. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశమైనప్పటికీ, జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే ఉంది. మరి ఉత్తరప్రదేశ్ లో జనాభా నియంత్రణకు చట్టం తీసుకొస్తుంటే మత కోణాన్ని ఎందుకు చూస్తున్నారు? ఈ చట్టంపై కాంగ్రెస్, సమాజ్ వాదీ, వామపక్ష పార్టీలు అసహనం వ్యక్తం చేయడం.. ఇది ముస్లింల అణచివేతకు దారితీస్తుందని ఆరోపణలు చేయడం కరెక్టు కాదు. ఎన్నికల లబ్ధి కోసమేనని కొందరు వాదించడంలోనూ నిజం లేదు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా, అది మైనారిటీ వర్గాలకు వ్యతిరేకమంటూ దుమ్మెత్తి పోయడం లౌకికవాద ముసుగు వేసుకున్న రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నదనేది ముఖ్యం కాదు. ఆ పార్టీ సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు. కానీ ఆ పార్టీకి అభివృద్ధి విషయంలో స్పష్టమైన కోణం ఉందా? లేదా? అనేదే ముఖ్యం. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఈ దృష్టి కోణం ఉండాలి.
ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ చిల్లర రాజకీయాలు..
ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన కాందిశీకులైన హిందువులకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది. ఇది కూడా ముస్లింలకు వ్యతిరేకమని, ఈ దేశం నుంచి ముస్లింలను తరిమేసేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కొందరు కుహనా లౌకికవాదులు, మేధావులు ముస్లిం సమాజంలో భయాందోళనలు సృష్టించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలతో ర్యాలీలు చేయించారు. ప్రభుత్వ నిర్ణయాలు ఏ మత వర్గాన్ని నొప్పించినా, వారి హక్కులకు భంగం కలిగించినా ప్రతిపక్షాలు అండగా నిలవాల్సిందే. కానీ మన ప్రతిపక్షాలు ఈ పనిని పక్కనపెట్టి, ముస్లింలలో దేశ వ్యతిరేక భావాలను నూరిపోశాయి. వీరు ప్రేరేపించడంతో కొందరు ముస్లిం నాయకులు మత కలహాలు సృష్టించే కామెంట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ముక్కలు ముక్కలుగా నరకాలని, ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే హిందువులందరినీ మూకుమ్మడిగా మట్టుపెట్టాలని వారు ప్రకటనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆర్టికల్ 370, 35ఎ, త్రిపుల్ తలాక్ రద్దు విషయంలోనూ కుహనా లౌకికవాదులు ముస్లింలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అప్పట్లో స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ముస్లింలీగ్ ను రెచ్చగొట్టి, దేశ ప్రజల్లో విభేదాలు సృష్టించింది. ముస్లింలలో దేశ విభజన బీజాలను నాటింది. దీంతో దేశం ముక్కలైంది. ప్రపంచంలో కనీవినీ ఎరుగని నరమేధం జరిగింది. ఇంత జరిగినా మన దేశంలోని చాలామంది రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో మార్పు రాలేదు. మోడీ ప్రభుత్వ వ్యతిరేకులు ఇప్పటికీ బ్రిటీష్ వాళ్ల పనిని కొనసాగిస్తున్నారు. మోడీని ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ మోడీపై ఉన్న వ్యతిరేకత, దేశంపై వ్యతిరేకతగా మారకూడదు. మోడీని ఎదుర్కోవడానికి ఆయన వ్యతిరేకులు చిల్లర పనులు చేయడం మానుకోవాలి.
మత సాంప్రదాయాలు అభివృద్ధికి అడ్డు కావొద్దు..
పెరిగిపోతున్న ముస్లిం జనాభాను తగ్గించడం కోసమే ఈ చట్టం తెస్తున్నారని కొందరు వాదించడంలో నిజం లేదు. పరిమిత కుటుంబం ఉంటేనే ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తామనేది ఈ చట్టంలోని ప్రధాన అంశాలు. ముస్లింలు మత సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పరిమిత కుటుంబం అనే భావనను ఇస్లాం వ్యతిరేకిస్తుందనేది నిజమే. మత సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రభుత్వ పథకాలను వదులుకుంటే వారి విషయంలో ఈ చట్టం పని చేయదు. ఆరోగ్య సిబ్బంది అన్ని వర్గాల ప్రజల దగ్గరికి వెళ్లి కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కల్పిస్తున్నారు. కానీ ముస్లింల దగ్గరికి వెళ్లలేకపోతున్నారనేది నిజం కాదా? ఈ విషయంలో లౌకికవాదం గురించి గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు ‘గోడమీది పిల్లుల్లా’ ఉన్నారనేది సత్యమే. మత సాంప్రదాయాన్ని తోసిరాజని కొందరు ముస్లింలు పరిమిత కుటుంబాన్ని కూడా పాటిస్తున్నారు. ఇక ఉత్తర ప్రదేశ్ సర్కార్ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకించడం కరెక్టు కాదు. ఇది సమాజంలోని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అభివృద్ధి, మత సాంప్రదాయాలు పరస్పర పూరకాలుగా ఉంటేనే మానవ సమాజం మనుగడ సాగిస్తుంది. మత సాంప్రదాయాలు అభివృద్ధికి అడ్డు రాకూడదు. ఇదే విషయాన్ని స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో నొక్కి చెప్పారు. రాజకీయ నాయకులు మత సంప్రదాయాలను గౌరవిస్తూ, అభివృద్ధి విషయంలో సరైన దిశానిర్దేశం చేస్తే ప్రజలు ఆనందిస్తారు.
ఆ ప్రమాదాన్ని గుర్తించాలె..
ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే జనాభా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చట్టాలు అమలు చేస్తున్నాయి. ఇదే కోవలో ఉత్తరప్రదేశ్ సర్కార్ కొత్త చట్టం తీసుకురానుంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే.. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు, సంక్షేమ పథకాలకు, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని అందులో పేర్కొంది. అయితే జనాభా నియంత్రణ సాకుతో సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు దూరం చేయడం అప్రజాస్వామికమని కొందరు వాదించొచ్చు. కానీ జనాభా విపరీతంగా పెరిగితే భవిష్యత్తులో సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, సమాజంలో శాంతి భద్రతలు కల్పించడం కష్టమవుతుందని, ప్రకృతి వనరుల కొరత తీవ్రమవుతుందని వారందరూ గుర్తించాలి. ఈ ప్రమాదాన్ని యోగి ప్రభుత్వ వ్యతిరేకులు ఎందుకు పసిగట్టలేకపోతున్నారు?
- ఉల్లి బాల రంగయ్య, సామాజిక విశ్లేషకుడు