బీఆర్ఎస్​ ఓట్లు.. బీజేపీకి షిఫ్ట్​

బీఆర్ఎస్​ ఓట్లు.. బీజేపీకి షిఫ్ట్​
  • సొంత ఇలాఖాలో సీఎం రేవంత్​ రెడ్డిని దెబ్బకొట్టేందుకు ఒక్కటైన ప్రతిపక్షాలు​
  • క్రాస్​ ఓటింగ్​తో కాంగ్రెస్​ క్యాండిడేట్​ను వెంటాడిన ఓటమి
  • బీఆర్ఎస్​ సిట్టింగ్  ఎంపీ మన్నె శ్రీనివాస్​ రెడ్డికి దక్కని డిపాజిట్

మహబూబ్​నగర్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి సొంత ఇలాకా అయిన పాలమూరులో ఆయన్ను దెబ్బకొట్టేందుకు ప్రతిపక్షాలు ఒక్కటిగా పని చేశాయి. లోక్​సభ ఎన్నికలకు షెడ్యుల్  వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్​, బీజేపీకి ఇంటర్నల్​ సపోర్ట్​ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. సీఎం కూడా సభలు, సమావేశాల్లో తనను పడగొట్టేందుకు, వంశీని ఓడించి తనను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను చూస్తే పెద్ద ఎత్తున క్రాస్​ ఓటింగ్​ జరిగినట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్​ సిట్టింగ్​ ఎంపీగా ఉన్న మన్నె శ్రీనివాస్​రెడ్డి ఏ రౌండ్​లో కూడా ఆధిక్యాన్ని సాధించలేదు. అన్ని రౌండ్లలో ఆయన థర్డ్​ ప్లేస్​కు పరిమితమయ్యారు. బీఆర్ఎస్​ ఓటు బ్యాంక్​ ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆయనకు లీడ్​ రాలేదు.

ఒక్క రౌండ్​లో కూడా రాని ఆధిక్యం..

మహబూబ్​నగర్  బీఆర్ఎస్​ సిట్టింగ్​ ఎంపీగా మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగారు. గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఆయన 41,78 శాతంతో 4,11,402 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన 1,54,792 ఓట్లతో థర్డ్​ ప్లేస్​కు పరిమితమై ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్​ కూడా దక్కలేదు. 21 రౌండ్లలో అన్నింట్లోనూ ఆయన థర్డ్​ ప్లేస్​లోకే పరిమితం కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పార్టీకి గత నవంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గంలో 44.6 శాతం ఓట్లు, మక్తల్ 30.55,  నారాయణపేట 40.97, మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో 37.72 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. 

పార్లమెంట్​ ఎన్నికల్లో మాత్రం ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్​​పూర్తిగా పడిపోయింది. బీఆర్ఎస్​ ఓట్​ బ్యాంక్​ మొత్తం బీజేపీకి ఫిష్ట్​ అయినట్లు టాక్​ నడుస్తోంది. ఈ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్​ లీడర్లు బీజేపీకి ఇంటర్నల్​గా సపోర్ట్​ చేశారని ఎన్నికల ప్రచారం నుంచే చర్చ నడుస్తోంది. దీనికితోడు బీఆర్ఎస్​ క్యాండిడేట్​కు మద్దతుగా ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్​ చూయించలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆయన పార్లమెంట్​ పరిధిలోని ప్రతి గ్రామానికి చేరుకోలేక ప్రచార రథాలను పెట్టి ఎలక్షన్​ క్యాంపెయిన్​ నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

దీనికితోడు పలు సందర్బాల్లో బీఆర్ఎస్​ క్యాడర్​తో ఇంటరాక్షన్​ అయిన ఆ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ‘మన క్యాండిడేట్​ ఎలాగూ ఓడిపోతాడు. ఆయనకు వేసే ఓటును బీజేపీకి వేయండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్​ గెలవొద్దు’ అని దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం కూడా జరిగింది. దీంతోనే ఈ నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీకి లీడ్​ వచ్చిందనే టాక్​ నడుస్తోంది. క్రాస్​ ఓటింగ్​ కావడంతోనే దేవరకద్రలో 1,810, మక్తల్​లో 9,078, నారాయణపేటలో 19,884, మహబూబ్​నగర్​లో 7,601 లీడ్​ వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇక్కడ లీడ్​ రావడంతోనే బీజేపీ విజయం సాధించగలిగిందని చెబుతున్నారు.

నాలుగో ‘సారీ’

15 ఏండ్లుగా మహబూబ్​నగర్​ పార్లమెంట్​పై బీఆర్ఎస్​ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణ ఉద్యమ సమయంలో 2009లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో మహబూబ్​నగర్​ నుంచి బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ పోటీ చేశారు. 3,66,569 ఓట్లు సాధించగా, 20,184 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్​ సిట్టింగ్​ ఎంపీ దేవరకొండ విఠల్​రావుపై విజయం సాధించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి ఏపీ జితేందర్​ రెడ్డి పోటీ చేయగా, 3,34,228 ఓట్లు సాధించారు.కాంగ్రెస్​ క్యాండిడేట్​గా పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్​రెడ్డిపై 2,590 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికలో మన్నె శ్రీనివాస్​ రెడ్డి పోటీ చేయగా 4,11,402 ఓట్లు సాధించారు. అప్పటి బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణపై 77,829 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన కేవలం 1,54,792 ఓట్లు సాధించి డిపాజిట్​ను కూడా కోల్పోయారు.