- పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాల ఆందోళన
- హాజరైన రాహుల్,కూటమి ముఖ్య నేతలు
- తెలంగాణ నుంచి పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీ, చామల, అనిల్, రేణుకా చౌదరి
- అదానీ వ్యవహారంపై చర్చ జరగాల్సిందే: ఎంపీ గడ్డం వంశీ
న్యూఢిల్లీ, వెలుగు: ‘మోదీ–అదానీ ఒక్కటే’ అంటూ ప్రతిపక్షాల నినాదాలతో మంగళవారం పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. అదానీ లంచాల వ్యవహారంలో చర్చకు పట్టుబడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. పార్లమెంట్ మకర ద్వారం వద్ద చేపట్టిన ధర్నాలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గడ్డం వంశీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, రేణుక చౌదరి ముందు వరుసలో నిలిచి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. అదానీతో ప్రధాని మోదీ చేతులు కలుపుతున్న భారీ ప్లెక్సీని ప్రదర్శించారు. ‘‘మోదీ, అదానీ ఒక్కటే, అదానీ బిలియన్స్ సంపాదనలో లబ్ధి పొందింది ఎవరు? ప్రధాని మోదీ, అదానీ స్కాం.. నేషన్ డిమాండింగ్– అన్సర్ మిస్టర్ మోదీ, అదానీ స్కాంపై జవాబుదారీతనాన్ని భారత్ కోరుతోంది, ప్రధాని మోదీ మౌనం–అదానీ స్కాంలో భాగస్వామ్యం’’ అని ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసిన ప్లకార్డులను ఎంపీ గడ్డం వంశీ, అనిల్ కుమార్, ఇతర ఎంపీలు పట్టుకొని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా.. ఈ ఆందోళనకు టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీలు దూరంగా ఉన్నాయి.
అదానీ అవినీతిదేశ ప్రజలకు తెలియాలి: ఎంపీ గడ్డం వంశీ
అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. ఆందోళన అనంతరం మకర ద్వారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్మెంట్ అధికారులకు ఆదానీ రూ.2,500 కోట్ల లంచాలు ఇచ్చి.. ఏపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి రూ.50 వేల కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ అవినీతి అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని పేర్కొన్నారు. అసలు ఆదానీ సంస్థ ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగిందని ప్రజలు ఆలోచిస్తున్న టైంలో.. సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందడం కోసం లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఆదానీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ కమిషన్ (ఎస్ ఈసీ) సమన్లు పంపిందని గుర్తుచేశారు. లంచాలు తీసుకున్న అధికారులు, కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థల వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు.
ఇక నుంచి సభకు సహకరిస్తూనే నిరసన..
పార్లమెంట్ లో గత ఆరు రోజులుగా ప్రతిపక్షాలు చేపడుతున్న నిరసనకు ముగింపు పలికినట్టు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. ఇకపై సభా కార్యకలాపాలకు సహకరిస్తూనే.. అదానీ, మణిపూర్, సంభాల్ అల్లర్లు, ఇతర అంశాలపై చర్చకు పట్టుబడతామని చెప్పారు. ప్రజానుకూల సమస్యలను లేవనెత్తేందుకే ప్రతిపక్షం పార్లమెంట్ కు వచ్చిందని, కొత్త తరహాలో నిరసనలు తెలుపుతామని సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. “ఇండియా కూటమి కొన్ని ముఖ్యమైన సమస్యలను లేవనెత్తుతూ.. తన నిరసనను కొనసాగిస్తుంది. అదానీ సంబంధిత కుంభకోణం, మణిపూర్, సంభాల్ అల్లర్లపై చర్చ పేరుతో సభ వాయిదా వేయడం మా కోరిక కాదు. వీటిపై చర్చించాలని విపక్ష నేతలం 267 నోటీసులు ఇచ్చాం. అయితే, సభ జరిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. మేము ప్రజల అనుకూల సమస్యలను లేవనెత్తడానికి ఇక్కడ ఉన్నాం. ఇకపై నూతన తరహాలో నిరసన కొనసాగిస్తాం’’ అని ఎంపీ సంతోష్ కుమార్ చెప్పారు.