పార్లమెంట్​లో అదానీ రగడ..చర్చకు ప్రతిపక్షాల పట్టు

పార్లమెంట్​లో  అదానీ రగడ..చర్చకు ప్రతిపక్షాల పట్టు

 

  • చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు
  • వెల్​లోకి దూసుకెళ్లి సభ్యుల నిరసన
  • అదానీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు
  • మణిపూర్, సంభాల్ హింసపై చర్చించాల్సిందే అని పట్టు
  • లోక్​సభ, రాజ్యసభలో వాయిదాలపర్వం

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాలపర్వం కొనసాగుతున్నది. న్యూయార్క్​లో గౌతమ్ అదానీపై కేసు, మణిపూర్​లో హింస, యూపీలోని సంభాల్​లో చెలరేగిన అల్లర్లపై చర్చించాలని అపోజిషన్ పార్టీలు పట్టుబడుతున్నాయి. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే రచ్చ కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అపోజిషన్ పార్టీ నేతలు వెల్​లోకి దూసుకెళ్లారు. దేశసంపదను అదానీకి దోచిపెడ్తున్నారని, అందుకే చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని మండిపడ్డారు. సభ్యుల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు లోక్​సభ స్పీకర్.. ఇటు రాజ్యసభ చైర్మన్ రిక్వెస్ట్ చేసినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. ప్రొసీడింగ్స్ సజావుగా సాగేందుకు సహకరించాలని అపోజిషన్ పార్టీ నేతలను స్పీకర్, చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోరారు. అయినా.. వినిపించుకోకపోవడంతో సభలను మంగళవారానికి వాయిదా వేశారు.

అదానీ వ్యవహారంపై రచ్చ

లోక్​సభ ప్రారంభమైన వెంటనే అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఓం బిర్లా దాన్ని తిరస్కరించారు. క్వొశ్చన్ అవర్ నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. సభ్యులు లేవనెత్తుతున్న అంశాలపై తర్వాత చర్చిద్దామని సూచించారు. అయినప్పటికీ.. అపోజిషన్ పార్టీ నేతలు వినిపించుకోలేదు. వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత చైర్​లో బీజేపీ సభ్యురాలు సంధ్యా రాయ్ కూర్చున్నారు. అపోజిషన్ పార్టీల ఎంపీలు మళ్లీ నిరసన తెలియజేశారు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభ్యుల నిరసనల మధ్యే కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024ను ఆ శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ లోక్​సభలో ప్రవేశపెట్టారు.

రాజ్యసభలోనూ అదే రచ్చ

రాజ్యసభలోనూ అదానీ వ్యవహారంపై రచ్చ కొనసాగింది. మణిపూర్​తో పాటు యూపీలోని సంభాల్​లో జరిగిన హింసపై అపోజిషన్ పార్టీ నేతలు చర్చకు పట్టుబట్టారు. 20 వరకు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చినా చైర్మన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెల్​లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితి మారలేదు. అదానీని ప్రధాని మోదీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. సభ్యుల నిరసనల కారణంగా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. 

వచ్చే వారం రాజ్యాంగంపై ఉభయ సభల్లో చర్చ

ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చించేందుకు ప్రభుత్వం, అపోజిషన్ పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ మేరకు లోక్​సభ, రాజ్యసభల్లో చర్చల తేదీలను డిసైడ్ చేశారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 13, 14వ తేదీల్లో లోక్​సభలో, 16, 17వ తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై అధికార, ప్రతిపక్షాలు చర్చిస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.

‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను చూసిన ప్రధాని మోదీ

‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను పార్లమెంటు ప్రాంగణంలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ చూశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, పలు రాష్ట్రాల సీఎంలు ఈ చిత్రాన్ని వీక్షించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ దర్శకుడు ధీరజ్ సర్నా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విక్రాంత్‌‌‌‌‌‌‌‌ మాస్సే, రాశీఖన్నా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నవంబర్‌‌‌‌‌‌‌‌ 15న విడుదలైంది.