చండూరు : నియోజకవర్గ అభివృద్ధి జరగడం లేదన్న బాధతో రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం చండూరు మండలం తుమ్మల పల్లిలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. 4 ఏండ్ల నుంచి మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, కానీ ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే అని మునుగోడు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మునుగోడు అభివృద్ధికి, టీఆర్ఎస్ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం బీజేపీ తోనే సాధ్యమని బీజేపీలో చేరి ఆయన పోటీ చేస్తున్నారని చెప్పారు.
కొయ్యలగూడెంలో టీఆర్ఎస్కు వ్యతిరేకత
ప్రచారం రద్దు చేసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
యాదాద్రి : చౌటుప్పల్మండలం కొయ్యలగూడెంలో టీఆర్ఎస్ప్రచారాన్ని ప్రజలు అడ్డుకుంటారన్న సమాచారంతో మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డి రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం గుడి మల్కాపురం తర్వాత కొయ్యలగూడెంలో మంత్రి ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉండగా, మంత్రి ప్రచార షెడ్యూల్ తెలియగానే.. అభ్యర్థి కూసకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై కొయ్యలగూడెం ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉండడంతో అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని పోలీసులు మంత్రికి చేరవేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా కూసుకుంట్లకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. విషయం తెలియడంతో మంత్రి తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.
కూసుకుంట్లపై కొయ్యలగూడెంలో వ్యతిరేకత
కొత్త పంచాయతీల ఏర్పాటులో కొయ్యలగూడెం మధిర గ్రామమైన ఎల్లంబావిని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని కొయ్యలగూడెం ప్రజలు ఆరోపించారు.
టీఆర్ఎస్ గెలుపు ఖాయం
చండూరు : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం చండూర్ మున్సిపాలిటీలోని సీపీఐ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం తాము కూడా చాలా సార్లు రాజీనామా చేశామని, రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. ‘సిలిండర్ ధర 400 నుంచి 1200 పెరిగేందుకా? డాలర్ తో రూపాయి విలువ పడిపోయినందుకా? మోటార్లకు మీటర్లు పెట్టడానికా?’ దేని కోసం రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారరని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే పన్ను కట్టేవాళ్లు బాధపడుతున్నారని మోడీ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ధనబలంతో గెలవాలని బీజేపీ కుట్ర చేస్తోందని, టీఆర్ఎస్అభ్యర్థిని గెలిపించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మందడి నర్సింహారెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, బొమ్మరబోయిన వెంకన్న పాల్గొన్నారు.
గ్రీన్ క్లబ్’ సేవలను కొనియాడిన గవర్నర్
సూర్యాపేట : ‘సూర్యాపేట గ్రీన్ క్లబ్’ సేవలను గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర రాజన్ కొనియాడారని గ్రీన్క్లబ్సభ్యులు చెప్పారు. మంగళవారం సూర్యాపేటలో వారు మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా రాజభవన్ లోని దర్బార్ హాల్లో గ్రీన్ గవర్నర్ తమిళసైని కలిసి శుభాకాంక్షలు తెలిపామన్నారు. ఈ సందర్భంగా గవర్నర్మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణకు గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంకుడు గుంతలు, మట్టి వినాయకుల పంపిణీ, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నియంత్రణకు జూట్‌బ్యాగుల పంపిణీ కార్యక్రమాలను కొనియాడారన్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారన్నారు. త్వరలోనే సూర్యాపేట కు వచ్చి గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమంలో పాల్గొంటాననిహామీ ఇచ్చారని తెలిపారు. గ్రీన్క్లబ్సభ్యులు ముప్పారపు నరేందర్, డాక్టర్ తోట కిరణ్, మీలా మహదేవ్, వనమాల వెంకటేశ్వర్లు, డాక్టర్ మీలా సందీప్, శ్రీరంగం రంగారావు, కర్పూరపు రాజేందర్, గుడిపాటి హరి పాల్గొన్నారు.
వాలీబాల్క్రీడలో జాతీయ స్థాయిలో రాణించాలి
మిర్యాలగూడ : వాలీబాల్ క్రీడలో స్టూడెంట్లు జాతీయ స్థాయిలో రాణించాలని మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. ఈ నెల 22న మిర్యాలగూడ టౌన్‌లోని గవర్నమెంట్జూనియర్ కాలేజీలో ప్రారంభమైన వాలీబాల్ జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు సోమవారం రాత్రి లక్ష్మారెడ్డి హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 48 జట్లు పోటీల్లో పాల్గొనగా మొదటి స్థానంలో నిలిచిన మిర్యాలగూడ జట్టుకు రూ. 20 వేలు, రెండో స్థానంలో నిలిచిన హుజూర్ నగర్ జట్టుకు రూ. 15 వేలు, మూడో స్థానంలో నిలిచిన (బీఎల్ఆర్ బుల్లెట్స్) కు రూ. 12 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన దిర్శంచర్ల జట్టు రూ. 10 వేల నగదు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్టౌన్ప్రెసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి బెజం సాయి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ పాల్గొన్నారు.
బుద్దవనంలో దమ్మ దీపోత్సవం
హాలియా: నాగార్జున సాగర్(నందికొండ) లోని బుద్ధవనంలో మంగళవారం మొదటి దమ్మ దీపోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బుద్ధవనం స్పెషల్ఆఫీసర్మల్లేపల్లి లక్ష్మయ్య, దాశరథి అవార్డు గ్రహీత డా. వేణు సంకోజు, అమెరికాకు చెందిన, స్థిరచిత్త బౌద్ధ సంస్థ సమన్వయకర్త మౌద్గల్యాయన, మహాబోధి బుద్ధ పూజ్య సంఘపాల భిక్షు వులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని మహా స్థూపం, బుద్ధపాదాలు, ఆచార్య నాగార్జున విగ్రహం, మహా స్థూపంలోని పంచధ్యాని ప్రధాన స్థావరాల్లో వెయ్యికి పైగా దీపాలను వెలిగించారు. అనంతరం దమ్మ బెలూన్‌ను ఆకాశంలో వదిలారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాసి సుదర్శన్, తెలంగాణా బీఎస్ఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సి. పరంధాములు, డా. బి. సత్తయ్య, స్థిరచిత్త నిర్వాహకులు కె.కె.రాజా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సాగర్ ను సందర్శించిన లక్నో హైకోర్టు జడ్జి
నాగార్జున సాగర్ ను మంగళవారం లక్నో హైకోర్టు జడ్జి అబ్దుల్ మోయిన్ కుటుంబ సమేతంగా సందర్శించారు. సోమవారం సాగర్ లోని విజయ విహార్ గెస్ట్‌హౌజ్‌కు చేరుకున్న జడ్జి దంపతులకు నిడమనూరు కోర్టు జడ్జి స్వప్న, నాగార్జున సాగర్ ప్రొటోకాల్ ఆఫీసర్ శరత్చంద్ర స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం సాగర్‌లోని బుద్ధ వనం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ మెయిన్డ్యాం, నాగార్జునకొండ మ్యూజియం ను సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో భద్రపరిచిన బుద్ధుడి వస్తువులను దర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ విశేషాలను వివరించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
యాదాద్రి : మునుగోడు ఉప ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సందర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం, జై కేసారం, నేలపట్ల, లింగన్నగూడెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వెహికల్ చెకింగ్ లిస్ట్‌ను పరిశీలించారు. ఆయా సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్లతో ఆయన మీటింగ్నిర్వహించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసిన చోట పట్టుబడిన నగదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఓటర్లను సీపీ కలుసుకొని ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయడానికి వచ్చిన జనరల్ అబ్జర్వర్ పంకజ్‌కుమార్‌ను సీపీ కలుసుకున్నారు.
బీఆర్ఎస్తో తెలంగాణ పదం లేకుండా చేసిండు
చండూరు : ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు కేసీఆర్‌కు అధికారమిస్తే.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ పదం లేకుండా చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం చండూరు మండలం ఇడికూడ లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజులు, నవాబుల చేతుల్లో ఉన్న భూమిని పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, బ్రిటీష్‌వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిన సేవలను గుర్తించి స్రవంతిని గెలిపించాలని కోరారు. చర్లగూడెం ప్రాజెక్టుపై ప్రజలకున్న అపోహలు తొలగించడానికి నాగం జనార్దన్ రెడ్డి ఇక్కడికి వచ్చారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చెప్పారు.
కేంద్ర పథకాలను ఓటర్లకు వివరించాలి
చౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు లీడర్లకు సూచించారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో నిర్వహించిన బూత్ లెవల్కమిటీ అధ్యక్షుల మీటింగ్‌కు ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు గెలవాలో వివరించాలని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్చేస్తుందన్న విషయం ఓటర్లకు చెప్పాలని కోరారు. అంతకు ముందు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బక్క స్వప్న, నందకుమార్ యాదవ్, పిట్టల అశోక్, జనగామ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
.................................................................