మోదీ సెక్యులరిస్ట్ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం: నడ్డా

 ప్రధాని మోదీ సెక్యులరిస్ట్ అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. బీజేపీ ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్​రావు, మహబూబాబాద్ ​అభ్యర్థి సీతారాంనాయక్​లకు మద్దతుగా సోమవారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం, మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభల్లో నడ్డా పాల్గొన్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా గ్రేటర్ హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. రిజర్వేషన్లపై అమిత్​షా చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని ఆయన మండిపడ్డారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తారని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. రిజర్వేషన్లు రద్దు చేయబోమని, అవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్​కు తగిన సమాధానం చెప్పాం. పుల్వామా, బాలాకోట్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. దేశంలో స్ట్రాంగ్ గవర్నమెంట్ కొనసాగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి” అని కోరారు. 

ఇండియా కూటమిలో అవినీతి నేతలు.. 

ఇండియా కూటమి నేతలు అవినీతిలో కూరుకుపోయారని నడ్డా విమర్శించారు. ‘‘అవినీతికి పాల్పడిన ఇండియా కూటమి నేతలంతా జైలుకెళ్లి వస్తున్నవారే. స్కామ్స్ లో చిక్కుకున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. జైల్లో ఉన్న వాళ్లకు ఇండియా కూటమి నేతలు మద్దతివ్వడం దారుణం. కాంగ్రెస్ నేతలతో పాటు మమతా బెనర్జీ, లాలూప్రసాద్ యాదవ్, డీఎంకే నేతలు కూడా అవినీతిలో కూరుకుపోయారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పలేని పరిస్థితి ఉంది” అని అన్నారు. బీజేపీలో ప్రధాని అభ్యర్థి మోదీనే అని తాము గట్టిగా చెబుతున్నామన్నారు. ‘‘స్మార్ట్​సిటీ పథకం కింద వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకు రూ. 2,500 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధికి  రూ.వేల కోట్లు ఖర్చు చేశాం. మహబూబాబాద్ లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తాం” అని తెలిపారు. ఈ సభల్లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణా రెడ్డి, లీడర్లు పొంగులేటి సుధాకర్​రెడ్డి, ప్రేమేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రిపోర్టర్ల ఫోన్లు గుంజుకున్నరు..

కొత్తగూడెం సభలో నడ్డా మాట్లాడుతుండగా జనం చాలామంది లేచి వెళ్లిపోయారు. బయటకు వెళ్లిపోతున్న ప్రజలను, ఖాళీ కుర్చీలను రిపోర్టర్లు వీడియో, ఫొటోలు తీస్తుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి ఫోన్లు గుంజుకున్నారు.