భద్రాచలం, సారపాక పంచాయతీల విభజనపై భగ్గుమన్న విపక్షాలు

భద్రాచలం, వెలుగు:  భద్రాచలం మేజర్​ గ్రామపంచాయతీని విభజిస్తూ పంచాయతీరాజ్​ చట్టసవరణ బిల్లును మంత్రి ఎర్రబల్లి దయాకర్​రావు శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం కూడా లభించింది. ఇకపై భద్రాచలం మేజర్​ పంచాయతీ భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్​ పంచాయతీలుగా మారనుంది. దీంతో పాటు బూర్గంపాడు మండలంలోని సారపాక మేజర్​ పంచాయతీని సారపాక, ఐటీసీ సారపాక పేరుతో రెండు జీపీలుగా విభజించారు. భద్రాచలం పంచాయతీలో 21 వార్డులు, సీతారామనగర్​ పంచాయతీలో 17, శాంతినగర్​ పంచాయతీలో 17, సారపాకలో 17, ఐటీసీ సారపాక పంచాయతీలో 15 వార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జీవో నెం.45ను పంచాయతీరాజ్​ శాఖ విడుదల చేసింది. భద్రాచలం, సారపాక పంచాయతీలకు చివరిసారిగా 2013లో పంచాయతీ ఎన్నికలు జరగగా, 2018లో పాలకవర్గాల గడువు ముగిసింది. అయితే ఈ రెండు పంచాయతీలను మున్సిపాల్టీలుగా అప్​గ్రేడ్ చేయాలని నిర్ణయించి ఎన్నికలు నిర్వహించలేదు. మున్సిపాలిటీల ఏర్పాటును గిరిజన సంఘాలు వ్యతిరేకించాయి. హైకోర్టును ఆశ్రయించాయి. గిరిజన చట్టాలు మున్సిపాలిటీకి అనువుగా లేవంటూ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెడతారంటూ హైకోర్టు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. తప్పని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహణకు సిద్ధపడిన ప్రభుత్వం పంచాయతీల విభజన బిల్లును తెచ్చింది. 

కమ్యూనిస్టుల ఆగ్రహం..

పంచాయతీ విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. భద్రాచలాన్ని ఒకే పంచాయతీగా ఉంచాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్​ సెంటర్​లో శనివారం సంతకాల సేకరణ చేపట్టారు. . జీవో నెం.45ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలి సంతకాన్ని సీపీఐ టౌన్​ సెక్రటరీ ఆకోజు సునీల్​కుమార్​ పెట్టారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు పట్టణ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎలా బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారంటూ నిలదీశారు. రాష్ట్ర విభజనలో పోలవరం ఆర్డినెన్స్ ద్వారా బలవంతంగా ఏడు మండలాలను ఏపీలో కలిపారని, ఆ రోజు గొంతెత్తిన బీఆర్ఎస్, ఇప్పుడు అదే విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించింది. ఒకటే పంచాయతీగా ఉంచి ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన బిల్లుపై పోరాడుతాం..

భద్రాచలం, సారపాక మేజర్​ పంచాయతీలను విభజించే జీవో నెం.45ను రద్దు చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్​ చేశారు. మున్సిపాల్టీగానైనా అప్​గ్రేడ్  చేయాలని లేదంటే మేజర్​ పంచాయతీగానైనా కొనసాగించాలన్నారు. లక్ష జనాభా ఉందని, విభజనతో అనేక ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్​ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.