తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమాటలు, చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎవరొచ్చినా రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదని, ఏం చేసినా కాంగ్రెస్ గెలిచేది లేదని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అన్నింటికీ కేంద్రం అడ్డం పడుతున్నదని ఆరోపించారు. తొమ్మిదేండ్ల కింద పార్లమెంట్లో ఆమోదించిన విభజన చట్టంలోని హామీలు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకుండా.. ఇప్పుడు గిరిజన వర్సిటీ ఇస్తున్నట్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు.
ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేండ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చని వాళ్లు అధికారం ఇస్తే ఐదేండ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు. కొత్తగా గిరిజన వర్సిటీ ఇచ్చిందేమీ లేదని, ఈ అంశాన్ని విభజన చట్టంలో తొమ్మిదేండ్ల కిందనే పెట్టారని అన్నారు. ఇప్పుడు దాన్ని ప్రకటించి ప్రజల చెవిలో పువ్వులు పెడ్తున్నారని మోదీపై విమర్శలు గుప్పించారు.
పాత రోజులు రైతులు మరిచిపోవద్దు
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టిన విషయం రైతులు మరిచిపోవద్దని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. కరెంట్ కోసం కండ్లలో ఒత్తులు పెట్టుకుని రాత్రింబవళ్లు బావుల వద్ద పడుకున్న విషయం మరిచిపోవద్దన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తూ ఆదుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని, భూములు రాయించుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యే అంశాలను కొత్త మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ జోడిస్తున్నారని చెప్పారు. కసిరెడ్డి నారాయణ రెడ్డికి రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇస్తే తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. అంతకుముందు ఆమనగల్లులో 50 బెడ్ల హాస్పిటల్కు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.10 -కోట్లతో టీయూఎఫ్ఐడీసీ పనుల పైలాన్ ఆవిష్కరించారు. లైబ్రరీ భవనాన్ని ప్రారంభించారు. కల్వకుర్తిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.45 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథను ప్రారంభించారు.
మీర్ఖాన్పేటలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన
కందుకూరు, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 180 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. తర్వాత మాట్లాడుతూ.. ‘‘కేంద్రం అన్ని రాష్ట్రాల్లో 157 కాలేజీలు ఏర్పాటు చేసి ఒక్క కాలేజీ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా కేసీఆర్ రాష్ట్ర నిధులతో 35 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు” అని చెప్పారు. వైద్య సాయం కోసం ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఆసుపత్రి కందుకూరులో ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అనుబంధంగా దాదాపు రూ.400 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం జరుగనుందని వెల్లడించారు.