ఎకరాకు రూ. 20 వేలు  ఇయ్యాలె.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న విపక్షాలు

  • ఎకరాకు రూ. 20 వేలు  ఇయ్యాలె
  • జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న విపక్షాలు
  • బీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం 

బచ్చన్నపేట, వెలుగు : పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం చెల్లించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్​ పార్టీలు ఆదివారం జనగామ జల్లా బచ్చన్నపేట చౌరస్తాలో  రాస్తారోకో చేశాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చి హామీ ఇచ్చినప్పటికీ ఆందోళన విరమించలేదు. సర్కార్​పై తమకు నమ్మకం లేదని స్వయంగా కలెక్టర్​, తహసీల్దార్ ​వచ్చి హామీ ఇవ్వాల్సిందేనని  డిమాండ్​ చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్​ బీమా రాష్ట్రంలో అమలు చేస్తే ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకు మేలు జరిగేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బేజాటి బీరప్ప అన్నారు. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో బీఆర్ఎస్​ నాయకులు బీజేపీ ​ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. ఒకదశలో ఇది తోపులాటకు దారి తీసి దాడి చేసుకునేవరకు వెళ్లింది. ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయినా రైతులు ఆందోళన విరమించలేదు. దాదాపు నాలుగు గంటలపాటు నిరసన కొనసాగించడంతో జనగామ ఆర్డీవో మధుమోహన్​ వచ్చి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్​రెడ్డి, జనగామ ఉపాధ్యక్షుడు బేజాటి బీరప్ప, మండలశాఖ అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి, కాంగ్రెస్​ నాయకులు నల్లగోని బాలకిషన్​, అల్వాల ఎల్లయ్య పాల్గొన్నారు.

సూర్యాపేట–జనగాం హైవేపై రైతుల ధర్నా 

సూర్యాపేట : అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం వేల్పుచర్ల గ్రామం వద్ద రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి నివేదిక పంపించి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తహసీల్దార్​ హామీతో రైతులు ధర్నా విరమించారు.