ఐక్యతే పాట్నా ఎజెండా!

భారత రాజకీయాలను మలుపుతిప్పే.. నూత్న ప్రసవానికి బీహార్‌‌‌‌ రాజధాని ‘పాట్నా’ మళ్లీ వేదికవుతోంది. 2600 ఏండ్ల కిందటి ‘పాటలిగ్రామ’ కాలక్రమంలో ‘పాటలీపుత్ర’గా.. కడకు నేటి ‘పాట్నా’గా మారింది. ఇది శిషునాగ, శుంగు, పాల, నంద, మౌర్య, గుప్త వంశాల రాచరిక వ్యవస్థలకు సాక్షీభూతంగా నిలిచింది. బింబిసారుని కొడుకు అజాతశత్రువు ఈ నగరాన్ని ఏర్పరచినట్టు చరిత్ర. చక్కటి స్థానిక స్వపరిపాలనతో, నాటి ప్రపంచంలోనే పెద్దనగరం పాటలీపుత్ర అని గ్రీక్‌‌‌‌ పర్యాటకుడు, చరిత్రకారుడైన మెగస్తనీస్‌‌‌‌ నమోదు చేశారు.

స్వతంత్ర భారతంలో ఎమర్జెన్సీ దుష్ట పాలనను దునుమాడి, ‘జనతా’ సర్కారును తెరపైకి తెచ్చిన రాజకీయ పోరాటానికి లోక్‌‌‌‌నాయక్‌‌‌‌ జయప్రకాశ్‌‌‌‌ నారాయణ బీజం వేసిందీ ఇక్కడే! ఇప్పుడు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్నీ జట్టుకడుతున్న పురిటినొప్పుల ‘లేబర్‌‌‌‌ రూమ్‌‌‌‌’ మళ్లీ పాట్నాయే! క నీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)తో ప్రజామద్దతుని, విపక్ష ఉమ్మడి అభ్యర్థులతో పాలకపక్షాన్నీ గెలవాలి. ఇదీ, దేశంలో ప్రతిపక్షం ముందున్న ఎజెండా! తొమ్మిదేండ్లలో బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గట్టిగా ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు సమావేశమౌతున్నాయి. బీహార్‌‌‌‌ ముఖ్యమంత్రి నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ చొరవతో, పలు వాయిదాల తర్వాత జరుగుతున్న ఈ భేటీకి కొన్ని మినహా దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలన్నీ హాజరవుతున్నాయి. భవిష్యత్‌‌‌‌ కార్యాచరణను ఖరారు చేస్తారు.

కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేతలు మల్లికార్జున్‌‌‌‌ ఖర్గే, రాహుల్‌‌‌‌ గాంధీలతో పాటు ఎన్సీపీ నేత శరద్‌‌‌‌ పవార్‌‌‌‌, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అర్వింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌, భగ్‌‌‌‌వంత్‌‌‌‌మాన్‌‌‌‌, స్టాలిన్(డీఎంకే), మాజీ సీఎంలు అఖిలేష్‌‌‌‌ యాదవ్‌‌‌‌(ఎస్పీ), ఫరూక్‌‌‌‌ అబ్దుల్లా(ఎన్సీ), మహబూబా ముఫ్తీ(పీడీపీ)లు, బిహార్‌‌‌‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌‌‌‌ (ఆర్జేడీ), ఉద్దవ్‌‌‌‌ థాక్రే(శివసేన), కమ్యూనిస్టు పార్టీల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్‌‌‌‌ రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌‌‌‌ పట్నాయక్‌‌‌‌(బీజేడీ), మాజీ సీఎం కుమారస్వామి(జేడీఎస్‌‌‌‌) తదితరులు హాజరుకావడం లేదు. వారు మినహాయిస్తే, దేశంలో విస్తారంగా ప్రాతినిధ్యమున్న పలు పార్టీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా భేటీ అవుతున్నాయి. సామాజిక, రాజకీయ శాస్త్రాల్లో ‘ఎజెండా సెట్టింగ్‌‌‌‌’ అనే ఓ మాటుంది. అంటే, సమకాలీన పరిస్థితుల్ని స్వయంగా తామే నిర్దేశించి, విధిలేక ప్రత్యర్థులు అదే బాటలోకి వచ్చేలా చేయడం. అలా చేయలేక, ఎదుటివాళ్ల ఎజెండా ట్రాప్‌‌‌‌లో పడిపోవటం కూడా జరుగొచ్చు. చూడాలి ఈ సారి ఏమవుతుందో! 

ఐక్యతే లక్ష్యమిపుడు

విపక్షాలన్నీ విడిగా తలపడటం వల్లే 2014, 2019 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయనే భావన రాజకీయక్షేత్రంలో బలంగా ఉంది. కొన్నేళ్లుగా దేశంలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్త వ్యవస్థ, పలు రాష్ట్రాల్లో పార్టీ ఉనికి -యంత్రాంగం ఉన్నందున ఆ పార్టీ కేంద్రకంగా విపక్షం బలపడాలని కొందరు సీనియర్‌‌‌‌ నేతలు ప్రతిపాదిస్తున్నారు. బీహార్‌‌‌‌ సీఎం నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ కొన్ని మాసాలుగా జరుపుతున్న కృషి ఈ ఆలోచనా స్రవంతిలోదే! దీనికి సీనియర్‌‌‌‌ నేత శరద్‌‌‌‌ పవార్‌‌‌‌ ఆశీస్సులున్నాయి. కాంగ్రెస్‌‌‌‌, కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీలు కలిసి ఐక్యంగా పోరాడితే తప్ప బీజేపీని కొట్టడం దుస్సాధ్యమనేది వారి దృఢాభిప్రాయం. హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌ గెలుపు తర్వాత.. ఓ పెద్ద రాష్ట్రమైన కర్నాటకలో బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్‌‌‌‌ స్వాధీనపరుచుకోవడాన్ని సానుకూలాంశంగా పరిగణిస్తున్నారు. అప్పటి నుంచి ఈ ఐక్యతా చర్యలు ముమ్మరమయ్యాయి. పాట్నా సమావేశం నుంచి గట్టి సందేశం లభిస్తుందని ఆయా పార్టీల అంచనా. ‘ఈ ఒక్క సమావేశంతోనే అన్నీ అయిపోవు, ఆ దిశలో ఇదొక పెద్ద ముందడుగు, తప్పక ఓ దారి ఏర్పడటం ఖాయం’ అనే విశ్వాసాన్ని సమావేశంలో పాల్గొనే పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటిదాకా జరిగిన సంప్రదింపు భేటీల్లో వెలిబుచ్చిన అభిప్రాయాల్ని బట్టి, కాంగ్రెస్‌‌‌‌ కేంద్రకంగా కమ్యూనిస్టులు, పలు ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా బీజేపీని ఎదుర్కొనే వ్యూహ రచన చేస్తారు. కొన్ని పార్టీలకు అభ్యంతరాలున్నందున ఇప్పటికిప్పుడు ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఏర్పడకపోవచ్చు. ఐక్యపోరాటానికి సంసిద్ధత వ్యక్తపరిచే ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశమైతే ఉంది. అందరికీ ఆమోదమున్న కొన్ని కీలక జాతీయస్థాయి అంశాలపై ఉమ్మడి పోరు చేపట్టవచ్చు. సమాఖ్య స్ఫూర్తికి గండికొట్టడం, దర్యాప్తు-నియంత్రణా సంస్థల సేవల్ని దుర్వినియోగపరచడం, రాజ్యాంగాన్ని చిన్నబుచ్చే చర్యలు, ఢిల్లీ ఆర్డినెన్స్‌‌‌‌ వంటివి తెచ్చి ఎన్నికైన ప్రభుత్వాల అధికారాలకు కత్తెరవేయడం, పెరిగిన నిరుద్యోగిత-, నిత్యావసరాల ధరలు... 
వంటి అంశాల్లో ఉమ్మడి పోరుకు కార్యాచరణను ప్రకటించవచ్చు.

తెలుగు రాష్ట్రాలది వింత పరిస్థితి

జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయానికి కేంద్రబిందువు కావాలనుకున్న తెలంగాణ సీఎం, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధినేత కేసీఆర్‌‌‌‌ ఈ విపక్ష ఐక్యతా యత్నాలకు దూరంగా ఉన్నారు. అలా ఉంటూ కేంద్రంలో ప్రత్యామ్నాయంగా అవతరించడం ఎలా సాధ్యమో అర్థం కాదు. ఆ కూటమిలో కాంగ్రెస్‌‌‌‌ ఉండటం ఆయన వ్యతిరేకించే అంశం. ఇక ఆంధ్రప్రదేశ్‌‌‌‌ది మరో ప్రత్యేక పరిస్థితి. ఏపీ సీఎం జగన్మోహన్‌‌‌‌రెడ్డి కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీతో నెరపుతున్న సఖ్యత వల్ల ఆయన ఈ కూటమికి దూరంగా ఉన్నారు. కిందటి ఎన్నికల్లో బీజేపీని తూర్పారపట్టిన ఏపీ అక్కడ విపక్షనేత చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రతిపక్ష ఐక్యతకు దూరంగా 
ఉండటం ఆశ్చర్యకరం!

ఓయూపీ ఓ పరిష్కారమే!

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయా విపక్ష పార్టీలకున్న బలాన్ని బట్టి వారికే నిర్ణయాధికారం ఇస్తూ, ఉమ్మడి అభ్యర్థుల్ని దింపడం సాధ్యమే అనే ప్రతిపాదన వస్తోంది. మొదట ఈ ప్రతిపాదనను 2019 ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ చేశారు. తర్వాతి కాలంలో శరద్‌‌‌‌ పవార్‌‌‌‌ కూడా ఇందుకు కొంత సుముఖత చూపారు. కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేత, మాజీ మంత్రి చిదంబరం ఓ ఆసక్తికర ఫార్ములా తెరపైకి తెచ్చారు. ఐక్యత కోరే విపక్షాలన్నీ కలిసి ‘ప్రతిపక్ష సమైక్యతా వేదిక’(ఓయూపీ) ఏర్పరచుకోవాలి. ఇందులో త్యాగాల పర్వమూ ఉంటుంది. ప్రతి విపక్షమూ ఇతర ప్రతిపక్షాలకు విధిగా కొన్ని రాజకీయ రాయితీలు ఇవ్వాలి. అంటే తనకుండే ఆధిపత్యం, ప్రత్యేకతలను కొంతమేర వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

అలాగే ఇతర పక్షాలు ఇచ్చే రాయితీల నుంచి ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉండాలి. దాని కోసం మొత్తం రాష్ట్రాలు-, కేంద్రపాలిత ప్రాంతాలను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. 1. కాంగ్రెస్‌‌‌‌ ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాలు(209 లోక్‌‌‌‌సభ స్థానాలు), 2. కాంగ్రేసేతర ప్రతిపక్షం ప్రథమ స్థానంలో ఉండే రాష్ట్రాలు(225), 3. బీజేపీ మిత్రపక్షం ప్రథమ స్థానంలో ఉండే రాష్ట్రాలు (53), 4. ఏ పార్టీ ప్రథమ స్థానంలో ఉన్నదీ స్పష్టంగా తెలియని రాష్ట్రాలు(56) అనేది ఈ విభజన. ప్రతిపక్షాలు ప్రథమ స్థానాల్లో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో బీజేపీయే ప్రాబల్యం కలిగి ఉంది. లోక్‌‌‌‌సభలో వారికి 300 పైచిలుకు స్థానాలున్నాయి. ఓయూపీ ఏర్పడి, ఆయా కెటగిరీల్లో ఉన్న ఆధిపత్యాన్ని బట్టి  ప్రాధాన్యతా క్రమంలో సీట్లు తీసుకోవడం ద్వారా ‘ఒంటరి ఉమ్మడి అభ్యర్థి’ ఫార్ములాను అమలు చేయవచ్చన్నది ప్రతిపాదన.

ఉమ్మడి అభ్యర్థులు సాధ్యమా?

వచ్చే 2024 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులకు పోటీగా విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థి ఒకరే ఉండేలా చూడాలన్నది స్థూలంగా ఓ లక్ష్యం. దీనికి, కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల వల్ల ఆయా పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. బెంగాల్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ - కమ్యూనిస్టులు జట్టుకట్టి తమను వ్యతిరేకించేట్టయితే అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్‌‌‌‌కు మద్దతిచ్చేది లేదని టీఎంసీ అంటోంది. విపక్షాల మధ్య ఓట్ల చీలిక నివారించడానికి రాజస్థాన్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌లో తాము పోటీ చేయొద్దంటే.. కాంగ్రెస్‌‌‌‌ పోటీ చేయకుండా ఢిల్లీ, పంజాబ్‌‌‌‌ను తమకు వదిలేయాలని ఆప్‌‌‌‌ ప్రతిపాదిస్తోంది. అందుకు కాంగ్రెస్‌‌‌‌ సిద్ధమా? ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఒక సయోధ్యకు అవకాశముంది.

కాంగ్రెస్‌‌‌‌కు కేరళలో, బెంగాల్‌‌‌‌లో కమ్యూనిస్టులే ప్రత్యర్థులైనప్పటికీ, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో అవి కలిసే పోటీ చేశాయి. అలాంటి అంగీకారం ఇతరులతో జాతీయ స్థాయిలో ఆప్‌‌‌‌, టీఎంసీలు కూడా ఏర్పరచుకోవచ్చన్నది యోచన. ఇలాంటి విషయాలు ఈ భేటీలో కాకుండా తదుపరి సమావేశాల్లో చర్చించే వీలుంది. సిమ్లాలో గాని, చెన్నైలో గాని విపక్షాల తదుపరి భేటీ జరగొచ్చు. ఉమ్మడి అభ్యర్థులో, పొత్తుల్లో ఎక్కడ ఎవరు ఎంత మేర పోటీ చేయాలో ఖరారు కాకుండా పార్టీల మధ్య ‘కనీస ఉమ్మడి కార్యక్రమ’ రచన సాధ్యం కాదనే అభిప్రాయముంది. ఎన్నికల ముందే కనీస ఉమ్మడి కార్యక్రమం ఖ‌‌‌‌రారైన‌‌‌‌ సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవని, ఏదైనా ఫలితాల తర్వాతే అనే వాదన ఉంది. కాంగ్రెస్‌‌‌‌ నేతృత్వపు యూపీఏ తో 2004లో కమ్యూనిస్టుల కనీస ఉమ్మడి కార్యక్రమం కూడా ఫలితాల తర్వాత జరిగిందేనని గుర్తు చేస్తున్నారు.
- దిలీప్‌‌‌‌ రెడ్డి, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ