మట్టి గణపతులనే పూజిద్దాం: తెలంగాణ సర్కార్

మట్టి గణపతులనే పూజిద్దాం: తెలంగాణ సర్కార్

గణేష్ పండుగ వస్తోంది..సరిగ్గా నెల రోజుల్లో గణేష్ ఉత్సవాలను ప్రారంభం కానున్నాయి. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు, ప్రజాప్రతినిధులు, నేతలు, ఉద్యోగులు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాలు కలిసి సంబరాలు నిర్వహించే పండుగ గణేష్ నవరాత్రి ఉత్సవాలు. మరి అలాంటి ఉత్సవాలను సంతోషంగా, పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించుకోవడం సామాజిక బాధ్యత. అందుకోసం మట్టి గణపతులను పూజిస్తూ.. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి.. 
రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) విద్యా సంస్థల్లో ఈ అంశంపై ప్రచారం చేపట్టనుంది. పీసీబీ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మట్టి విగ్రహాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

చెరువులు కుంటలనుంచి మట్టిని సేకరించి గణపతుల ప్రతిమలను తయారు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తిరిగి మరలా గణేషుల నిమజ్జనం చెరువులు, కుంటల్లో చేయడం ద్వారా పర్యావరణం పరరక్షింపబడుతుందని మంత్రి పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు హైదరాబాద్ వంటి మహానగరాల్లో  మట్టి గణపతులకు పూజలు చేయాలని సూచించారు. 
పర్యావరణానికి హాని కలిగించే రంగులు,ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసే గణపతులను మంచినీటి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల కలుషితం అవుతాయని.. అంతే కాకుండా పండుగల్లో ఉపయోగించే పువ్వులు, ఇతర పదార్థాలను చెరువుల్లో వేయొద్దని మంత్రి ప్రజలను కోరారు.