- రాష్ట్రంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్తాయన్న వాతావరణ శాఖ
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- రెండు రోజుల్లో మరొకటి ఏర్పడే చాన్స్
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, రెండు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అల్పపీడనాల ప్రభావంతో బుధవారం భారీ వర్షాలు.. గురు, శుక్ర, శనివారాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారానికి కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాలకు మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ద్రోణితో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించింది. అలాగే, హైదరాబాద్‌లోనూ రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆసిఫాబాద్‌లో జోరువాన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 7.9, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
పడిపోయిన టెంపరేచర్లు
రాష్ట్రంలో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లా ధనోరాలో 35.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కన్నా తక్కువకు పడిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో అత్యల్పంగా 27.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 28.3, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో 28.7, మేడ్చల్ జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 29.2, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 29.4, మెదక్ జిల్లా దొంగల ధర్మారంలో 29.7, నారాయణపేట జిల్లా మాగనూరులో 29.8, వనపర్తి జిల్లా ఆత్మకూరు, రంగారెడ్డి జిల్లాల్లో 30 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.