ఫేక్ వీలునామాతో కోట్ల ప్రాపర్టీ కొట్టేశారు!

 ఫేక్ వీలునామాతో  కోట్ల ప్రాపర్టీ కొట్టేశారు!
  • ఓఆర్సీ దందాలో కదులుతున్న డొంక
  • లీగల్  డాక్యుమెంట్లు, కోర్టు కేసు ఉన్నా భూమిబదలాయించిన ఆఫీసర్లు
  • అడిషనల్ కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు


గద్వాల, వెలుగు: ఆర్డీవో ఆఫీసులోని ఓఆర్సీ దందా డొంక కదులుతోంది. ఫేక్  వీలునామా సృష్టించి కోట్ల రూపాయల ప్రాపర్టీని కొట్టేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అలాగే అయిజ పట్టణం నడిబొడ్డున ఉన్న కోట్ల విలువ చేసే  ఐదెకరాల ఎండోమెంట్  భూమికి సైతం ఓఆర్సీ ఇచ్చేశారు. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నా, ప్రస్తుతం కబ్జాలో ఉండి కాస్తు చేస్తున్నా, కోర్టులో కేసు పెండింగ్  ఉన్నా అవేమి పట్టించుకోకుండా ఫేక్  వీలునామా అగ్రిమెంట్(రిజిస్టర్  డాక్యుమెంట్లు) పెట్టి కోట్ల రూపాయల ప్రాపర్టీని ఇతరుల పేర్లపై మార్చేసి లక్షల రూపాయలు  దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే ఓఆర్సీలతో తిప్పలు పడుతున్న బాధితులు ఒక్కొక్కరుగా అడిషనల్  కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారు.

ఫేక్ వీలునామాతో 11.20 ఎకరాలు..

గద్వాల మండలం గద్వాల శివారులోని సర్వే నంబర్ 895, 900 లో 11 ఎకరాల 20 గుంటలు పొలం ఉంది. ఇదే సర్వే నంబర్ల గుండా రింగ్  రోడ్డు కూడా పోయింది. గద్వాల పట్టణానికి ఆనుకొని ఉండడం, రింగ్  రోడ్డు ఉండడంతో ఈ పొలానికి విపరీతమైన డిమాండ్  ఉంది. కొన్నేండ్ల నుంచి ఈ సర్వే నంబర్లు నన్నే సాబ్, మహమ్మద్, సుభాన్  కబ్జాలో ఉన్నారు. ప్రస్తుతం దానిని సాగు చేస్తున్నారు. ఫేక్  వీలునామా సృష్టించి మొత్తం పొలాన్ని కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నా..

లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా ఇతరులకు పొలాన్ని ధారాదత్తం చేశారని బాధితులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్  నంబర్ 72 / 77,1977లో పట్టాదారునికి భూమి వచ్చింది. దాని నుంచి వారి వారసులకు 1/3/1988లో పట్టేదారుగా ఉన్న చిన్న హుస్సేన్  సాబ్ కి ప్రొసీడింగ్ నంబర్ 4259 పేరా ఇచ్చారు. ఆ తర్వాత పట్టాదారు వారసులకి 19/9/ 2006న పట్టాదారు వారసులకు ప్రొసీడింగ్  నంబర్ 5188/2006 న ఇచ్చి పాత పాస్  పుస్తకాలు కూడా అందజేశారు. ఇదే సర్వే నంబర్ల గుండా రింగ్​ రోడ్  పోవడంతో 25/4/2013న రెవెన్యూ ఆఫీసర్లు భూమి పోతుందని నోటీసులు ఇచ్చారు.

 15/5/2023న సర్వేయర్  సర్వే చేసి పొజిషన్ లో నన్నే సాబ్, మహమ్మద్, సుభాన్  ఉన్నారని రిపోర్ట్  ఇచ్చారు. అదేవిధంగా ఆర్ఐ, తహసీల్దార్​ పంచనామా చేసి రిపోర్టు కూడా అందజేశారు. ఇవన్నీ లీగల్ గా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కాస్తులో ఉన్నా, సివిల్  కోర్టులో కేసు పెండింగ్​లో ఉన్నప్పటికీ ఇవేమి పట్టించుకోకుండా ఏకపక్షంగా 17/08/24న ఏకపక్షంగా ఇతరులకు ఈ ప్రాపర్టీని బదలాయించి తమకు అన్యాయం చేశారని పట్టాదారులు, పొజిషన్ లో ఉన్నవారు 
ఆరోపిస్తున్నారు.

ఓఆర్సీపై అప్పీల్ కు పోయినా..

సర్వే నంబర్  895, 900లో ఉన్న 11 ఎకరాల 20 గుంటల భూమికి ఓఆర్సీ ఇవ్వగా, దానిపై 11/09/24న బాధితులు అప్పీలుకు పోయారు. తీర్పు రాకముందే తహసీల్దార్​ ఆ ఓఆర్సీతో రికార్డులో ఎక్కించడం, రికార్డులో ఎక్కిన వెంటనే ఓఆర్సీ తీసుకున్న వారు(6/10/2024న) ఇతరుల పేరుపై సగం పొలాన్ని రిజిస్ట్రేషన్  చేసేసి తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని బాధితులు వాపోతున్నారు. ఇలా రెండు నెలల్లోనే తమ పనులను చక్కబెట్టుకొని కోట్ల రూపాయల విలువ చేసే భూమి కాజేశారని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఫేక్  వీలునామాగా ఇలా గుర్తించారు..

అక్రమార్కులు ఫేక్  వీలునామాపై ఉన్న వేలిముద్రలు, పట్టేదారు 1977లో డాక్యుమెంట్  నంబర్  72/77లో ఉన్న రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్లలో ఉన్న వేలిముద్రలను ట్రూత్  ల్యాబ్ కు పంపించి టెస్ట్​ చేయించగా, రెండు వేలిముద్రలు వేర్వేరుగా ఉన్నాయని ట్రూత్  ల్యాబ్  వారు రిపోర్ట్  ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఇదిలాఉంటే ఓఆర్సీల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.

ఓఆర్సీపై రీఎంక్వైరీ చేస్తున్నాం..

సర్వే నంబర్  895, 900కు ఇచ్చిన ఓఆర్సీపై రీ ఎంక్వైరీ చేస్తున్నాం. బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదుతో ఆర్డీవో ఆఫీస్  రికార్డులను తెప్పించి పరిశీలిస్తాం. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు. లక్ష్మీనారాయణ, అడిషనల్  కలెక్టర్