
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వెంటనే పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి తాజాగా విచారించారు.
ఈ కేసును ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లయినా ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, అందువల్ల 6 నెలల్లో ఈ కేసు విచారణ పూర్తయ్యేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.గౌతం వాదనలు వినిపిస్తూ కేసు విచారణ జరగకుండా నిందితులు ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం ఇంకా కోర్టు నుంచి కాగితాలు తీసుకునే దశలోనే ఉన్నారని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరు ఇదే కారణం మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టేలా చూడాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు.
ఇందులో భాగంగా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రజాప్రతినిధుల కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నదని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కూడా సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఉన్నారని, అందువల్ల ఈ పిటిషన్‌ను కూడా ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.