
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ రెబల్స్‌కు భారీ రిలీఫ్ కలిగింది. అనర్హతపై ఈ నెల 24 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్ సీపీ జోషీని హై కోర్టు ఆదేశించింది. పైలెట్ తరఫున ముకుల్ రోహాద్గీ అనే న్యాయవాది హై కోర్టులో వాదనలు వినిపించారు. పైలెట్, మిగతా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ అత్యుత్సాహం ప్రదర్శించారని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు చెప్పారు. రీజన్ చెప్పకుండా నోటీసులు జారీ చేశారని ఆయన చెప్పారు. నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారని, కావాలనే నోటీసులు ఇచ్చారని తెలుస్తోందని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో గత కొద్ది రోజులుగా రాజకీయ అనిశ్చితి నడుస్తోంది. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటు సచిన్‌పైలెట్ సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు. ఆయనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు అశోక్‌గెహ్లాట్‌పై తిరుగుబాటు చేశారు. సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను సవాలు చేసిన ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.