- జగిత్యాల జిల్లాలో బీడీ కంపెనీ యజమానుల ఆర్డర్
- అవసరం లేకున్నా కొంటున్న మహిళలు
కొడిమ్యాల, వెలుగు : బీడీ కార్మికుల రెక్కల కష్టం యజమానుల పాలవుతోంది. పొద్దంతా కష్టం చేస్తే నెలకు వచ్చేది 2000 నుంచి 3000 రూపాయలు మాత్రమే. ఇందులో కూడా యజమానులు దోపిడీ చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లాలో దేశాయి బీడీ కంపెనీ యజమానులు తమ కంపెనీ తయారు చేసిన ఖారా ప్యాకెట్లు కొనాలని కార్మికులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరికి స్థానికంగా ఉండే టేకేదార్లు మద్దతు ఉండడంతో కార్మికులు నష్టపోతున్నారు.
రెండు నెలల నుంచి ప్రతినెలా రూ.200 విలువైన ఖారా ప్యాకెట్లను బలవంతంగా అంటగడుతున్నారు. తాము రోజు కష్టపడితే రూ.200 కూడా రాదని, తప్పనిసరి కొనాలని అంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలోని బీడీ కంపెనీల యజమానులైతే రూ.300 విలువైన ఖారా ప్యాకెట్లను బలవంతంగా అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా లేబర్ డిపార్ట్ మెంట్అధికారులు పట్టించుకోవడం లేదు.
మా దృష్టికి వస్తే చర్యలు తీనుకుంటాం
టేకేదార్లు బలవంతంగా ఖారా ప్యాకెట్లు అంటగడుతున్నారని మా దృష్టికి రాలేదు. అలాంటిది ఎక్కడైనా జరిగితే టేకేదార్లపై, యజమానుల పై చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ రద్దు చేస్తాం. కార్మికులు ఆన్లైన్లో గాని లేదా మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయ్యొచ్చు.
- కృష్ణసాగర్, ఏఎల్ఓ