భద్రాచలం, వెలుగు: ఐటీడీఏ పరిధిలో నిర్వహించే గిరిజన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఐటీడీఏ డీడీలు, ఆర్సీవోలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థులకు రక్త పరీక్షలు చేయించాలన్నారు. తలసేమియా, సికిల్సెల్ఎనీమియా, ప్రాణాంతక జన్యు సంక్రమిత వ్యాధులు ఏమైనా ఉంటే గుర్తించాలన్నారు.
ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో స్కూళ్లు, హాస్టళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, భోజనం, తాగునీరు విషయంలో కేర్ఫుల్గా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ డీడీ డేవిడ్రాజ్మాట్లాడుతూ 2017లో ఒకసారి ఇదే తరహాలో వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఎటువంటి కేసులు రాలేదని, నిత్యం102 వైద్య బృందాలతో రోజుకు 5100 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించేలా యాక్షన్ప్లాన్తయారు చేసినట్లు వివరించారు. అనంతరం డీడీ భద్రాచలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. వంటశాల, తాగునీటి ట్యాంకులను పరిశీలించారు. సరఫరా అయ్యే నిత్యావసర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు.