హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ నుంచి హరిబౌలి రోడ్డు వెడల్పు చేసేందుకు 2005లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు బదులు తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలంటూ గత హైదరాబాద్ కలెక్టర్ ఎల్.శర్మన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌కు హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. జులై 31న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రోడ్డు వెడల్పు చేసే చర్యల్లో భాగంగా చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కొంత మంది పిటిషన్లు దాఖలు చేస్తే.. దాన్ని హైకోర్టు కొట్టేసింది. దీనిపై పిటిషనర్లు అప్పీల్ దాఖలు చేశారు.
దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టిన సందర్భంగా భూసేకరణ నోటిఫికేషన్లు ఉపసంహరించుకుని తాజాగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ ప్లీడర్ చెప్పారు. దీంతో డివిజన్ బెంచ్ అప్పీల్ పిటిషన్‌పై విచారణ మూసేసింది. అయితే, ప్రభుత్వం తిరిగి నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, పాత నోటిఫికేషన్ ప్రకారమే భూసేకరణ చేపడుతున్నారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని సయ్యద్ జియా ఉద్దీన్ హుస్సేనీ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.