బిర్యానీకి ఎలక్షన్​ గిరాకీ.. ప్రచారంతో పెరిగిన ఆర్డర్లు

బిర్యానీకి ఎలక్షన్​ గిరాకీ.. ప్రచారంతో పెరిగిన ఆర్డర్లు
  • జీహెచ్ఎంసీలో ప్రచారంతో పెరిగిన ఆర్డర్లు
  • కార్యకర్తలకు బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్న క్యాండిడేట్లు
  • హోటల్స్ కి బల్క్ లో ఆర్డర్స్… 80 శాతం బిజినెస్ పికప్
  • అవసరాన్ని బట్టి స్టాఫ్ ని పెంచుతున్న హోటల్స్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు కావడంతో బిర్యానీలకు డిమాండ్ పెరిగింది. లాక్ డౌన్ వల్ల అంతంతమాత్రంగానే నడుస్తున్న హోటల్ బిజినెస్.. ఇప్పుడు బల్క్ బిర్యానీ ఆర్డర్స్ తో ఒక్కసారిగా పెరిగింది. ఎన్నికల ప్రచారం మొదలయ్యాక 80 శాతం బిజినెస్ జరుగుతోందని హోటళ్ల ఓనర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఎన్నికల హడావుడి కొనసాగనుండటంతో బిర్యానీకి గిరాకీ ఇలానే ఉంటుందని అంటున్నారు.

ప్రీ ఆర్డర్స్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, నేతలకు క్యాండిడేట్లు టిఫిన్లు, భోజనాలు పెట్టిస్తున్నారు. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి టైంలో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో అన్నిపార్టీలు ముందుగానే తమ ప్రాంతాల్లోని హోటళ్లకు ఆర్డర్లు ఇస్తున్నాయి. ప్రచారానికి వస్తున్న వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని హోటల్స్ కి ప్రీ ఆర్డర్స్ ఇస్తున్నాయి. ఇక బల్క్ ఆర్డర్స్ కోసం బిర్యానీని ప్రస్తుతానికి ఉన్న చెఫ్ లతో చేయిస్తున్నామని, అవసరం పడితే పార్సిల్ ప్యాకింగ్, మీట్ కటింగ్ కోసం ఇతర స్టాఫ్ ని టెంపరరీగా తీసుకుంటున్నామని హోటల్స్ ఓనర్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం మొదలైన ఏరియాల్లోని హోటల్స్ కి రోజూ 4 నుంచి 5 బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల డీలా పడిపోయిన బిజినెస్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని హోటళ్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బిర్యానీ తెప్పిస్తున్నం.. మీల్స్ వండుతున్నం

ఎన్నికల ప్రచారంలో మొత్తం 300 మందికి పైగా పాల్గొంటున్నం. ప్రచారానికి వస్తున్న కార్యకర్తలకు ఫుడ్ మేమే పెడుతున్నం. బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నం. మీల్స్ వండిపెడుతున్నం. మా క్యాండిడేట్ కోసం మేమే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని ఇలా చేస్తున్నం.

– టీఆర్ఎస్ కార్యకర్త, ఫిలింనగర్