చింతపల్లి ఎస్సై సతీశ్ ​​రెడ్డి సస్పెన్షన్ .. ఎస్పీ అపూర్వరావు ఉత్తర్వులు 

  • పీఎస్​లో నిందితుడి మృతి కేసులో ఎస్పీ అపూర్వరావు ఉత్తర్వులు 

నల్గొండ అర్బన్, వెలుగు :  నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్సై సతీశ్​రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ కె.అపూర్వరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఓ భూవివాదం కేసులో చింతపల్లి మండలంలోని పాలెంతండాకు చెందిన నేనావత్​సూర్యానాయక్​ను ఎస్ఐ సతీశ్​రెడ్డి పోలీస్​స్టేషన్​కు తీసుకువచ్చాడు. విచారణ  కోసం లోపలకు తీసుకువెళ్లిన కొద్దిసేపటికే సూర్యానాయక్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని దవాఖానకు తీసుకువెళ్లేలోపే చనిపోయాడు.

దీంతో మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సతీశ్​రెడ్డిని వెంటనే హెడ్​క్వార్టర్​కు అటాచ్ ​చేశారు. విచారణలో ఎస్ఐ భూ వివాదంలో తలదూర్చి అత్యుత్సాహం చూపించాడని తేలడంతో సస్పెన్షన్ ​వేటు వేశారు. భూ వివాదాలు, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అపూర్వరావు హెచ్చరించారు.