కేసీఆర్​ లెక్క సామాన్య రైతు కార్పొరేట్​కు అమ్ముకోవద్దా?

కేసీఆర్ కంట్లో నలుసు పడితే కార్పొరేట్ హాస్పిటల్ కు పోతాడు. కేటీఆర్, కేసీఆర్ తిరిగే కార్లు కార్పొరేట్ కంపెనీలు తయారు చేసినవి కాదా? కేసీఆర్ మనవడు చదివే స్కూలు కార్పొరేట్ కాదా? పోలీస్ హెడ్ క్వార్టర్ కార్పొరేట్ స్టైల్ లో ఉండాలనుకుంటాడు. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కార్పొరేట్ వ్యవసాయం చేస్తాడు. రిలయన్స్ మార్ట్, ఫోరం మాల్ కు లాంటి కార్పొరేట్ సంస్థలకు పంటను అమ్ముతాడు. మరి సామాన్య రైతులు ఎందుకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోకూడదా? ఎండనకా వాననకా పని చేసే రైతు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుని ఎక్కువ డబ్బు సంపాదించుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదా? అదానీ ఇస్తేనేం, అంబానీ ఇస్తేనేం, ఏ యల్లయ్యో పుల్లయ్యో ఇస్తేనేంది రైతుకు ఎక్కువ ధరలు వస్తే తప్పేంటి?  ధర ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకు రైతులు అమ్ముకుంటారు. సీఎం కేసీఆర్ రైతుల గురించి మాట్లాడటమే ఈ దశాబ్దపు పెద్ద జోక్.

రాష్ట్రంలో రైతులు కనపడలేదా?

పంజాబ్ ఏజెంట్లు మొదలు పెట్టిన ఫేక్ ఉద్యమంలో ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చి వత్తాసు పలుకుతోంది. మేం ఏ చిన్న నిరసన తెలిపినా పోలీసులు వెంటనే అరెస్టు చేసేటోళ్లు. ఇప్పుడు కేటీఆర్, ఈళ్ల మంత్రులు రోడ్డు మీద కూర్చుంటామని చెబుతున్నారు. మన రాష్ట్రంలో అంకాపూర్, నిజామాబాద్ లో రైతులు రోడ్ల మీద కొస్తే ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ఈ రోజు ఎక్కడ్నో పంజాబ్ ఏజెంట్లు రోడ్డుమీద కొస్తే భారత్ బంద్ అంటా రోడ్డు మీద కొస్తుండు. రాష్ట్రంలో రైతులు రోడ్ల మీదకు వచ్చేదుంటే వాళ్లే చేసేవాళ్లు. మీ మంత్రులు, పోలీసులు వచ్చి బలవంతంగా బంద్ చేయించాల్సిన అవసరం ఏముంది? అయ్యా, కొడుకులు పచ్చి అబద్ధాల కోరులు. ఇప్పుడున్న మార్కెట్ యార్డ్ వ్యవస్థ ద్వారా కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమో లేదా ప్రైవేటు ప్లేయర్సో ఎక్కువ ధర ఇవ్వొచ్చని కొత్త అగ్రి చట్టంలో ఉంది. రైతులకు మేలు చేసేందుకే మేము చట్టాలు చేశాం. ఈ చట్టాలపై వెనక్కి వెళ్లం. అవసరమైతే మద్దతు ధరపై చట్టంలో క్లారిటీ పెంచేలా చేరుస్తాం.

2008లోనే పంజాబ్ రైతులు ప్రైవేటోళ్లకు అమ్ముకుంటమన్నరు

ఈ రోజు ఉద్యమం చేస్తున్నోళ్లు రైతులు కాదు. పంజాబ్ లోని అర్థీలనే ఏజెంట్లు. గోధుమలను ప్రైవేటు వ్యక్తులు కొనేందుకు అడ్డంకులు తొలగించాలని 2008లో పంజాబ్, హర్యానా రైతులు రోడ్డెక్కారు. ఎవరికైనా పంట అమ్ముకునే హక్కు ఇవ్వాలని నాడు కోరారు. అయితే పంజాబ్, హర్యానాలో వరి, గోధుమలను కొనే అర్థీలు అనే ఏజెంట్లకు ఏడాదికి రూ.3 వేల కోట్లకు పైగా కమీషన్ సంపాదించుకుంటున్నారు. ఆ సంపాదన పోతుందని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఉద్యమం చేయడానికి రైతులను పిండి పిప్పిచేసి సంపాదించిన వేల కోట్లు డబ్బు వాడి కూలీలను తెచ్చుకుంటున్నారు. దేశంలో మరెక్కడా రైతులు ధర్నాలు ఎందుకు ధర్నా చేయడం లేదో ఆలోచిస్తే అర్థమవుతుంది. ‘అగ్రికల్చర్ మార్కెట్ ప్రొడ్యూస్ యాక్ట్ ను రద్దు చేస్తాం..  రైతు ఉత్పత్తుల ఎగుమతులపై నిబంధనలను సరళతరం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో సహా ఎక్కడైనా స్వేచ్ఛగా రైతులు పంటను అమ్ముకునేలా మార్పులు తెస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. మార్కెట్ యార్డులను ఉంచుతూనే ప్రైవేటు పార్టీలకు అవకాశం ఇస్తామని మేం చెబుతున్నాం. కానీ యూపీఏ ఏకంగా ప్రభుత్వ మార్కెట్ల రద్దు చేస్తామని చెప్పింది. గతంలో వాళ్లు చేయలేకపోయినవి ఇప్పుడు మేం చేస్తున్నాం.

మద్దతు ధరపై తప్పుడు ప్రచారం

కనీసం మద్దతు ధరకు హామీ లేదన్న మాటపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రైతులకు గ్యారెంటీ ప్రైస్ ఉంటుందని చట్టంలోనే ఉంది. రైతులు స్వేచ్చగా ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు. ముందుగా ఒక వేళ ఒప్పందం చేసుకున్నా సరే పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్ రేటు ముందుగా మాట్లాడుకున్న ధర కన్నా ఎక్కువ ఉంటే పాత ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా రైతులకు చట్టం కల్పిస్తుంది. ఒక వేళ పంట కోత సమయానికి మార్కెట్ లో ఒప్పందం చేసుకున్న దాని కన్నా తక్కువ రేటు ఉన్నా డీల్ కుదుర్చుకున్న వ్యక్తి లేదా కంపెనీ ఒప్పందం చేసుకున్న రేటు ప్రకారమే చెల్లించి తీరాలని చట్టంలో స్పష్టంగా ఉంది.-ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ.