ఆర్గాన్ ట్రాన్స్​ప్లాంటేషన్​లో ప్రైవేట్ పెత్తనానికి కళ్లెం

ఆర్గాన్ ట్రాన్స్​ప్లాంటేషన్​లో ప్రైవేట్ పెత్తనానికి కళ్లెం
  • ఇక నచ్చినోళ్లకు ఆర్గాన్స్ ఇవ్వలేరు!
  • హెల్త్ కండిషన్​ను బట్టి అవయవాల కేటాయింపు
  • త్వరలో కొత్త గైడ్​లైన్స్
  • ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి కమిటీ
  • తోటా యాక్ట్ ప్రకారం రూల్స్ రెడీ చేస్తున్న వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్, వెలుగు: ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల విషయంలో ప్రైవేట్ హాస్పిటళ్ల పెత్తనాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ప్రైవేట్ దవాఖానాల్లో బ్రెయిన్ డెడ్ కేసుల్లో కేవలం కిడ్నీలు మాత్రమే జీవన్‌దాన్‌కు పంపిస్తూ.. మిగిలిన అవయవాలను తమకు నచ్చిన వారికి ఇచ్చే నిబంధనను సవరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తోటా యాక్ట్ ప్రకారం వైద్యారోగ్య శాఖ గైడ్​లైన్స్ సిద్ధం చేస్తున్నది.  గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన “ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్”ను అడాప్ట్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నది. 

ఇందులో భాగంగా జీవన్‌దాన్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో అవయవ మార్పిడి విధానాలను అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేయనున్నది. 

ప్రస్తుతం జీవన్‌దాన్ వ్యవస్థలో అనేక సమస్యలున్నాయి. రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లు సంవత్సరాల తరబడి వేచి ఉన్నా అవయవాలు అందడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానాల్లో రిజిస్టర్ చేసుకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అవయవాలు ఎప్పుడు వస్తాయో.. సీరియల్ నంబర్ ఆధారంగా ట్రాన్స్​ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తారో అనేదానిపై స్పష్టత లేదు. 

సరైన వ్యవస్థ లేకపోవడంతో నిరుపేద పేషెంట్లకు అవయవాలు అందడం లేదు. అదే సమయంలో, ప్రభుత్వ హాస్పిటల్స్​లో బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసే అవకాశాలు తక్కువగా ఉండగా, ప్రైవేట్ హాస్పిటల్స్​లో బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఒక కిడ్నీ మాత్రమే జనరల్ పూల్‌కు వెళ్తున్నది. మిగిలిన అవయవాలన్నీ ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్​లో రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లకు చేరుతున్నాయి. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్​లో పేర్లు నమోదు చేసుకున్నవారు ఏండ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. 

పేషెంట్ హిస్టరీ హిస్టరీపై స్టడీ

కొత్త నిబంధనలతో అవయవాల కేటాయింపు (అలకేషన్) విధానంలోనూ మార్పులు రానున్నాయి. ఇకపై పేషెంట్ హెల్త్ కండీషన్ ఆధారంగా అవయవాలను కేటాయించనున్నారు. దీనికోసం కమిటీ.. పేషెంట్ హిస్టరీని పూర్తిగా అధ్యయనం చేసి, అవయవ మార్పిడికి అనుమతి ఇవ్వనున్నది. ఈ కొత్త రూల్స్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కండీషన్ సీరియస్​గా ఉన్నవారికి ఆటోమేటిక్‌గా అవయవాలు అందేలా డిస్ట్రిబ్యూషన్ విధానం అమలు అవుతుందని అధికారులు తెలిపారు. 

పేదలు, క్రిటికల్ కండీషన్​లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. త్వరలోనే ఈ కొత్త నిబంధనలను ప్రభుత్వం ప్రకటించనున్నదని ఒక వైద్యాధికారి వెల్లడించారు.