అవయవ మార్పిడిపై సర్కార్ ఫోకస్
నేడు కేబినేట్ సబ్ కమిటీలో చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కిడ్నీ, లివర్ రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ, అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుతం నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు చేస్తున్నారు. అయితే, ఆర్గాన్ డోనర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో, చాలా మంది పేషెంట్లు వెయిటింగ్ పీరియడ్‌లోనే చనిపోతున్నారు. యాక్సిడెంట్లలో రోజూ బ్రెయిన్ డెత్స్ జరుగుతున్నప్పటికీ, వాటిని గుర్తించే వ్యవస్థ మనదగ్గర సరిగాలేదు. దీంతో చాలా ఆర్గాన్స్ వృథా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ ప్రాసెస్‌కు సడలింపులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్స్ దవాఖానలోనే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆరోగ్యశాఖ, జీవన్‌దాన్ ఆఫీసర్లు ప్రపోజల్స్ తయారు చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని మెంబర్లుగా ఉన్న మెడికల్ అండ్ హెల్త్ కేబినేట్ సబ్ కమిటీ మీటింగ్ గురువారం జరగనుంది. ఈ సమావేశంలో ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు మొత్తం 18 అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. ఉస్మానియా హాస్పిటల్ పాత బిల్డింగ్‌ను కూల్చి కొత్తది కట్టాల్నా? పాతది అలా ఉండగానే పక్కన మరో బిల్డింగ్ కట్టాల్నా? అన్న అంశంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
పోస్టుల భర్తీకీ ఓకే?
హైవేలపై ట్రామా సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయిస్తోంది. ఎక్కడెక్కడ సెంటర్లు ఏర్పాటు చేయాలనే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పోస్ట్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పోస్ట్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్‌కి తరలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లుగా కొత్త పోస్టులు క్రియేట్ చేయకుండా, ఇంచార్జులతోనే నెట్టుకొస్తోంది. పూర్తిస్థాయిలో హెవోడీలను నియమించకపోవడంపై డాక్టర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడు పోస్టుల క్రియేషన్, ఇతర ఖాళీల భర్తీ, కొత్తగా ఏర్పాటైన హాస్పిటళ్లలో పోస్టుల క్రియేషన్ అంశం కూడా మీటింగ్ ఎజెండాలో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వైద్యారోగ్యశాఖలో10 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి వన్ టైమ్ పర్మిషన్‌పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. హుజూరాబాద్, సిరిసిల్ల, గజ్వేల్ సహా పలు చోట్ల డయాలసిస్ మిషన్లు పెంచాలన్న ప్రపోజల్స్ కు కూడా మంత్రులు ఆమోదం తెలపనున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల పెంపు, టిమ్స్ హాస్పిటల్ డెవలప్‌మెంట్, జిల్లా దవాఖాన్లు, టీచింగ్ హాస్పిటళ్లలో హెల్ప్ డెస్కుల ఏర్పాటుపై కూడా మీటింగ్ లో చర్చించనున్నారు.
For More News..