మహబూబాబాద్, వెలుగు: వ్యవసాయంలో రైతులు సేంద్రియ సాగు పద్ధతులు పాటిస్తూ టెక్నాలజీని వినియోగించుకోవాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ప్రతి రైతు ఒక పాడి గేదెను పెంచుకుంటే కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు, స్వతహాగా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చని సూచించారు. త్రిపురతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆర్గానిక్ పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
గురువారం మహబూబాబాద్జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, కలువల గ్రామాల్లో నూకల అభినవరెడ్డి ఫౌండేషన్, అరబిందో ఫార్మా పౌండేషన్ఆధ్వర్యంలో సంయుక్తంగా రైతులకు సేంద్రియ సాగుపై నిర్వహించిన అవగాహన సమావేశానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు భూమిసారం దెబ్బతినకుండా సులభ పద్ధతుల్లో వ్యవసాయ చేసుకుంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రధాన మంత్రి డ్రోన్ స్కీమ్ ద్వారా సులభ పద్ధతిలో వ్యవసాయం చేసుకునేందుకు రైతులకు సబ్సిడీ పై డ్రోన్లను అందజేస్తున్నట్లు తెలిపారు.
డ్రోన్ టెక్నాలజీతో ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్న గుర్రం మమత, కుంట అమృతను అభినందించారు. పాలేకర్ వ్యవసాయ విధానంపై విజయరావు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్రామ్ నాథ్, సంస్థ నిర్వాహకులు ఎస్ .జైపాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో అలివేలు, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ మరియన్న, పి.వెంకన్న, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.