గిరిసీమలో సేంద్రియ విప్లవం

  • ఆర్గానిక్​ పంటల సాగులో 1,500 మంది
  • మోడ్రన్​ అగ్రి‘కల్చర్’కు సవాల్
  • చేదోడుగా నిలుస్తున్న ఏకలవ్య ఫౌండేషన్​ 
  • రైతులను సత్కరించేందుకు 26న రానున్న ఆరెస్సెస్ చీఫ్

ఆదిలాబాద్,​ వెలుగు: గిరికోనల్లో సేంద్రియ విప్లవం మొదలయింది.. ఏకలవ్య ఫౌండేషన్​ సభ్యుల సూచన మేరకు సేంద్రియ వ్యవసాయంలో ప్రావీణ్యం పొంది, జనాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ ​చీఫ్​ మోహన్​ భగవత్​ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు దంపతులతో మాట్లాడారు. వారితోపాటు రైతులందరినీ సత్కరించడానికి ఈ నెల 26న ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్​ మండలం లింగాపూర్​ గ్రామానికి రానున్నారు.

రసాయనాల వినియోగంతో వ్యవసాయ రంగం క్రమంగా సంక్షోభంలోకి కూరుకుపోతున్న సమయంలో గిరిసీమ  మేలుకొంది. ఆర్గానిక్ ​పంటలు పండిస్తూ మోడ్రన్​ అగ్రికల్చర్ కు సవాల్​ విసురుతోంది. ఒకరిద్దరు కాదు, ఇరవై గూడేలకు చెందిన 1,500 మందికిపైగా రైతులు రెండు మూడేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ మహాయజ్ఞానికి ఏకలవ్య ఫౌండేషన్​ సభ్యులు చేయూతనిస్తూ వస్తున్నారు. వారి సూచనల మేరకు గోమూత్రం, పేడతో సేంద్రియ ఎరువులు తయారుచేసి పంటల్లో వాడుతూ అధిక
దిగుబడులు సాధిస్తున్నారు.

ఏకలవ్య ఫౌండేషన్..

సేంద్రియ వ్యవసాయం చేయడంలో ఏకలవ్య ఫౌండేషన్ రైతులకు అండగా నిలుస్తోంది. ఆవుపేడ, మూత్రంతో దాదాపు 20 రకాల సేంద్రియ ఎరువులను ఇప్పుడు గిరి రైతులే సొంతంగా తయారు చేసుకుంటున్నారు. గోమూత్రం, ఆవుపేడ, కొన్నిరకాల చెట్ల ఆకులతో అడుగు మందులు, పురుగు మందులు, పలురకాల కషాయాలు తయారుచేసి పంటకు సీజనల్​ రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 15 సంవత్సరాల క్రితమే ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే పని మొదలుపెట్టింది. గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామం కేంద్రంగా గిరిజన రైతులకు సేంద్రియ సాగు విధానాలు, పంటల దిగుబడులపై అవగాహన కల్పించి.. ఒక్కొక్కరిగా మొదలుపెట్టి వందలమందిని తనసాగు దళంలో చేర్చుకుంది. ప్రస్తుతం ఇంద్రవెల్లి, ఉట్నూర్​, సిరికొండ, గుడిహత్నూర్, ఇచ్చోడ, జైనూర్, సిర్పూర్ ​యు, లింగాపూర్ ​మండలాల్లోని మారుమూల గ్రామాల్లో కేవలం సేంద్రియ ఎరువులతో కూరగాయలు, తొగరి, పెసర, మినుములు, మక్కలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు తదితర పంటలు పండిస్తున్నారు.

కలెక్టర్​ చొరవతో.. విక్రయ కేంద్రం

పండించిన పంటలను ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్​ నేచురల్స్​తోపాటు, సేంద్రియ కూరగాయలు, ఆహారాన్ని ఇష్టపడే వారికి విక్రయిస్తున్నారు. గిరిజనులు పండించే సేంద్రియ పంటలను నేరుగా అమ్ముకునేందుకు గత  కలెక్టర్ దివ్య దేవరాజన్​ రెండేళ్ల క్రితం తన సొంత డబ్బులతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులందరినీ సభ్యులుగా చేస్తూ ఆ కేంద్రానికి ఆదిలాబాద్​ నేచురల్స్​అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రతి రైతు అక్కడే తన పంటలను అమ్ముకుంటున్నారు. కొందరు ఔత్సాహికులు తమ పంటలను, ఆవు పాలను నేరుగా కస్టమర్లకు అందజేస్తున్నారు.

రైతు దంపతులకు సన్మానం

ఏకలవ్య ఫౌండేషన్ చేస్తూ వస్తున్న ఈ సేంద్రియ విప్లవానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆది నుంచి దిశానిర్దేశం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ అభినందించేందుకు ఏకలవ్య ఫౌండేషన్ ఓ బృహత్తర ప్రోగ్రామ్  చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 26 న గుడిహత్నూర్​ మండలంలోని లింగాపూర్​లో ఈ కోవకు చెందిన దాదాపు 1500 మంది రైతు కుటుంబాలను మోహన్​ భగవత్​సన్మానించనున్నారు. జాతీయస్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో సేంద్రియ వ్యవసాయదారులకు సన్మానం చేయడం ఇదే మొదటిసారి.

పుడమిపుత్ర పురస్కారం

ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతు దంపతులపేర్లు గైక్వాడ్​ సునీత, రామేశ్వర్​. వీరు తమకున్న ఐదెకరాల భూమిలో కేవలం సేంద్రియ పంటలనే పండిస్తున్నారు. జిల్లాలో సేంద్రియ ఆహారాన్ని ఇష్టపడేవారికి వారు పండించే పంటలను మంచి ధరలకు విక్రయిస్తున్నారు. వీరి పనితనానికి గుర్తింపుగా గాంధీ జ్ఞాన్ ​ప్రతిష్టాన్, కేవీకే రైతుమిత్ర ఫౌండేషన్​ సౌజన్యంతో ‘పుడమి పుత్ర’ పురస్కారం అందజేశారు. ఈ దంపతులతోపాటు, సేంద్రియ పంటలు పండిస్తున్న రైతులందరినీ సన్మానించే కార్యక్రమం ఆర్ఎస్ఎస్​ చేపట్టింది.

విజయం సాధించాం

రసాయనిక ఎరువులతో పండించిన పంటల కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్గానిక్​ పంటల సాగు కోసం ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాలను ఎంపిక చేశాం. మొదట కాస్త ఇబ్బంది కలిగినా.. తర్వాత కొందరు గిరిజన రైతులు ఆర్గానిక్ పంటల సాగుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం వారి సంఖ్య 1500 దాటింది. గిరిజనుల సహకారంతో సేంద్రియ సాగులో విజయం సాధించాం. – డాక్టర్ కె. నారాయణ రెడ్డి, ఆర్​ఎస్​ఎస్ బాధ్యులు. 

ఇవి కూడా చదవండి 

పైసలు ఇవ్వకున్నా పర్లే.. మెంబర్‌‌షిప్‌‌ తీసుకోండి

చార్మినార్ దానమిస్తే రిజిస్టర్ చేసుకుంటరా?

బోధన్‌‌‌‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా

ఫారిన్ లిక్కర్ అగ్గువకే