పేదలకు ఉచితంగా న్యాయ సహాయం:  కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి

పేదలకు ఉచితంగా న్యాయ సహాయం:  కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి

సిద్ధిపేట, వెలుగు: పేదరికం కారణంగా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పేదలందరికీ ఉచిత న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం సిద్దిపేటలో తెలంగాణ స్టేట్, హైదరాబాద్ -డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీల ఆధ్వర్యంలో నల్సా మాడ్యూల్ క్యాంపును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు ఆర్థిక స్తోమత లేనివారికి ఉచిత న్యాయం అందించేందుకు ఈ సంస్థ పని చేస్తుందన్నారు. కేసుల్లో కక్షిదారులను సమన్వయ పరిచి వారిని ఒప్పించి రాజీ కుదర్చడం సంస్థ  ప్రధాన ఉద్దేశమన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లీగల్ సెల్ అథారిటీలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. అనంతరం జిల్లా జడ్జి, లీగల్ సర్వీసెస్ ఆథారిటీ చైర్మన్ డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ చట్టంపై అవగాహన కల్పించి వారికి ఇంత తక్కువ సమయంలో గుర్తింపు కార్డులు అందించడం అభినందనీయమన్నారు. సిద్ధిపేటలోని 20మంది ట్రాన్స్ జెండర్లకు ఐటీ కార్డులు అందించారు. ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, జడ్జి స్వాతిరెడ్డి, ప్రిన్సిపల్ జడ్జి మిలింద్ కాంబ్లే, జూనియర్ సివిల్ జడ్జిలు సౌమ్య, వల్లాల శ్రావణి యాదవ్, లాయర్లు జనార్దన్ రెడ్డి, దేవునూరి రవీందర్, లక్ష్మీనారాయణ, వెంకట లింగం, కనకయ్య, బాలయ్య, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.