సూర్యాపేట, వెలుగు: జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ ప్రశ్నించారు. మంగళవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఆర్డీవో ఆఫీస్‌కు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేసి.. అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని సీఎం కేసీఆర్ 2016లో హామీ ఇచ్చి అక్షయపాత్ర ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించినా.. నేటికీ అమలు కావడం లేదని మండిపడ్డారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా గుళ్లు, గోపురాలకు వేల కోట్లు ఖర్చు పెట్టడమంటే బడుగు బలహీన వర్గాలను చదువుకు దూరం చేయడమేనని విమర్శించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని, అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్‌లో సీట్లు ఇవ్వాలని, కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలోఅదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు పుల్లూరి సింహాద్రి, పిడమర్తి భరత్, శ్రీకాంత్, బాలు, సలోమి, ఉమా, కావ్య, అశ్విత, శ్రావణి, హాసిని, షాహిన తదితరులు పాల్గొన్నారు.