ఒడిషా రైలు ప్రమాద ఘటన దృశ్యాలు ప్రజల మనసులను కలిచి వేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 750 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాణాలు కోల్పోయిన వారిలో అభం శుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారు.
ఘటన జరిగిందిలా..
పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బాలాసోర్‌లోని బహనాగా స్టేషన్ వద్ద 'సిగ్నలింగ్ వైఫల్యం' కారణంగా లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ ట్రాక్ పై గూడ్స్ ట్రైన్ ఆగివుండటంతో దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అందులో కొన్ని భోగీలు.. పక్కనున్న మరో ట్రాక్ పడటం.. అదే సమయంలో బెంగళూరు - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్‌పై రావడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది.
గాయపడ్డ డ్రైవర్లు, గార్డులు..
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో డ్రైవర్లు, గార్డులు గాయపడినట్లు ఖరగ్‌పూర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రాజేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్, అతని సహాయకుడు, గార్డు మరియు బెంగళూరు - హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గార్డు గాయపడినట్లు ఆయన తెలిపారు. వీరందరూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో గూడ్స్ రైళ్ల ఇంజిన్ డ్రైవర్, గార్డు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు.