పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు కన్పించడం సాధారణమయ్యాయి. ఇటీవల కాలంలో దాదాపుగా ప్రతిరోజు ఒకరు చొప్పున చనిపోతూనే ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతుల వివరాలను కనుక్కోవడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. డెడ్‌బాడీలను గాంధీ మార్చురీకి తరలించి, అక్కడ మూడు రోజులు ఫ్రీజర్‌లో ఉంచుతున్నారు.
ఆ తర్వాత అంత్యక్రియల కోసం జీహెచ్ఎంసీకి అప్పగిస్తున్నారు. గత ఆరు నెలల్లో 67 మంది గుర్తుతెలియని వ్యక్తులు గాంధీ ఆవరణలో చనిపోయినట్లు ఎస్సై కిషోర్ తెలిపారు. పత్రికలతో పాటు వివిధ సమాచార మాధ్యమాల్లో ఫొటోలతో సమాచారం ఇస్తున్నప్పటికీ డెడ్‌బాడీలను తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రావట్లేదన్నారు.
అయిన వారే కాదనుకొని...
గాంధీలో అనాథల చావుల వెనుక మరో కోణం దాగి ఉందనే వాదనలు ఉన్నాయి. ఇంట్లో వయస్సు పైబడి, అనారోగ్యంతో బాధపడే వారిని ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో కొందరు వారిని వాహనాల్లో తీసుకొచ్చి గాంధీ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోతున్నారనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు, గాంధీ ఎదుట నిత్యం రెండు, మూడు పూటలు.. పలువురు అన్నదానాలు నిర్వహిస్తున్నారు. దాంతో చుట్టుపక్కల నుంచి వస్తున్న యాచకులు, ఇక్కడే రోడ్డు డివైడర్లపై, మెట్రో స్టేషన్ కింద స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఏండ్ల తరబడి జీవిస్తున్నారు. దాదాపుగా ఇందులో ఎవరికి కుటుంబం అనేది లేదు. వీరు అనారోగ్యం బారిన పడినప్పుడు ఎవరు పట్టించుకోక, చివరికి రోగం ముదిరి ఫుట్ పాత్‌లు, రోడ్ల పక్కన, గాంధీ ఆవరణలో ప్రాణాలు విడుస్తున్నారు.
ఒంటరిగా వచ్చి మరికొందరు
మరోవైపు, అనారోగ్యంతో వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి నిత్యం వందలాది మంది వస్తుంటారు. కొందరు తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో , మరికొందరు ఒంటరిగా వస్తుంటారు. అయితే, ఒంటరిగా వచ్చిన వారి ఆరోగ్యం కుదుటపడకపోవడం, మరికొన్ని కారణాలతో ఒంటరిగా గాంధీ ఆవరణలో యాచకవృత్తి కొనసాగిస్తున్నారు. నిత్యం ఇక్కడే పెట్టే అన్నదానం కార్యక్రమాల్లో తింటూ నెలల తరబడిగా ఇక్కడే కాలం గడుపుతున్నారు.
ఈ క్రమంలో అనారోగ్యానికి గురై కొందరు, తమను ఎవరు పట్టించుకునే వారు లేకపోవడంతో వ్యాధి ముదిరి మరికొందరు ఇక్కడే కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ సమయంలో ఎవరు ఎవరిని వదిలిపెట్టి వెళ్తున్నారు? ఎవరు ఎక్కడ్నుంచి వస్తున్నారు? వంటి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
గత ఆరు నెలలుగా గాంధీలో లభ్యమైన డెడ్‌బాడీలు
మార్చి - 12
ఏప్రిల్ - 8
మే - 8
జూన్ - 13
జూలై - 11
ఆగస్ట్ - 15