కాగ జ్ నగర్,వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఆ పిల్లలు తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ యూసుఫ్, ఆసియా బేగం దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు.
ఆసియా బేగం ఏడేండ్ల క్రితం పాముకాటుతో చనిపోగా, అనారోగ్యంపాలైన యూసుఫ్ రెండేండ్ల క్రితం చనిపోవడంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. నిరుపేద కుటుంబమైన వీరికి గ్రామంలో ఓ పూరి గుడిసె మాత్రమే ఉంది. అది కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం సర్కార్ దరఖాస్తులు తీసుకుంటుండడంతో ఇద్దరు బాలికలు గురువారం సిర్పూర్ టీలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో దరఖాస్తు చేశారు.
పెద్ద కూతురు మహీన్ నిద మంచిర్యాల్ జిల్లా బెల్లంపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా రెండో కూతురు నూరి బేగం కాగజ్ నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ లో 9వ తరగతి చదువుతోంది. బాలుడు మహమ్మద్ ముస్తఫా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మదర్సాలో చదువుతున్నాడు. కాంగ్రెస్సర్కారు తమపై దయచూపి ఇల్లు మంజూరు చేయాలని ఆ ఇద్దరు బాలికలు ఉన్నతాధికారులను కోరారు. ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.