ప్రపంచదేశాల యుద్ధాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ... ఆర్థికనష్టం, ప్రాణ నష్టంతో పాటు ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు. యుద్ధాలు, జాతి వివక్ష పోరాటాలు, అంతర్గత సంఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల పిల్లలు చాలా మంది అనాథలుగా జీవనం సాగిస్తున్నారు.
రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల్లో మిలియన్ల పిల్లలు అనాథలయ్యారు. ఇటీవలి రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, -పాలస్తీనా దాడుల కారణంగా అనాథల సంఖ్య పెరిగింది. రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు మూడేళ్లు పూర్తవుతోంది. ఇరువైపులా ఎంతోమంది మరణించారు.
రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అభం శుభం ఎరుగని ఎందరో చిన్నారులు భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు.
రెండు ప్రపంచ యుద్ధాల్లో అధికారిక అంచనాల ప్రకారమే పోలాండ్‌లో మూడు లక్షలు, యుగోస్లేవియాలో రెండు లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. యునిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి) గణాంకాల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీసావసరాలైన ఆహారం, నీరు, నిలువనీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. అనాథలుగా మారినవారిలో ఆసియా దేశాల్లో ఆరు కోట్లు, ఆఫ్రికాలో ఐదు కోట్లు, మరో కోటిన్నర మందికి పైగా అనాథలు కరీబియన్, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నారు.
దుర్భరంగా అనాథ పిల్లల జీవనం
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలుగా మారారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఏర్పడిన సంక్షోభం వల్ల ఇరు దేశాలకు చెందిన ఎందరో పిల్లలు అనాథలయ్యారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల జీవితం ప్రశ్నార్థకమవుతోంది.
యుద్ధాల వల్ల ఏర్పడిన పేదరికం, కరువు, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తుల మధ్య అనాథ పిల్లల జీవనం దుర్భరంగా మారింది. ‘రేపటి సాయుధ ఘర్షణ నుంచి బాలలను నేడు రక్షించాలి’ అన్న అంశంపై ఆరున్నరేళ్ల క్రితమే ఐక్యరాజ్యసమితి ఓ సమావేశంను నిర్వహించింది.
యెమెన్, మాలి, దక్షిణ సూడాన్‌తో పాటు పలు దేశాల్లో సాయుధ ఘర్షణలతో బాలలు, యువకుల జీవితాలు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గనిస్థాన్‌లో ఒక తరానికి శాంతియుత వాతావరణమే లేకుండా పోయిందని, 2017లో బాలల హక్కులపై 21 వేలకు పైగా ఉల్లంఘనలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆదుకోవడం అందరి బాధ్యత
చత్తీస్‌గఢ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ర్టాల్లో సాయుధ గ్రూపులకు, ప్రభుత్వానికి మధ్య హింస పిల్లలపై ప్రభావం చూపుతోందని గుటేరస్ నివేదిక వెల్లడించింది. కరోనా కారణంగా మన దేశంలో 2022 ఫిబ్రవరి నాటికి తల్లిదండ్రులను కోల్పోయి 10,386 మంది పిల్లలు అనాథలుగా మారారు. ఇందులో తెలంగాణ నుంచి 253 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 418 మంది పిల్లలున్నారు.
ప్రభుత్వాలతో పాటు ప్రతి పౌరుడు అనాథల విషయంలో తమ పరిధి మేరకు సహాయపడటానికి ముందుకు రావాలి. మన దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది పిల్లలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దేశ సంపదకు జరిగే నష్టమెంతో గుర్తెరగాలి. యుద్ధ అనాథలను అక్కున చేర్చుకోవడం, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం, అర్హత కలిగిన అనాథలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం ప్రభుత్వ, ప్రభుత్వేతర, పౌర సమాజ కనీస బాధ్యతగా భావించాలి. దేశాభివృద్ధిలో యుద్ధ అనాథలను భాగస్వాములను చేస్తూ మానవీయతను వికసింపజేయాలి.
- కోడం పవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్–