ఓఆర్​ఆర్​ టెండర్​.. ఖజానాకు రూ.15 వేల కోట్లకు పైనే నష్టం

ఓఆర్​ఆర్​ టెండర్​.. ఖజానాకు రూ.15 వేల కోట్లకు పైనే నష్టం
  • ఓఆర్​ఆర్​ టెండర్​.. ఎవరికి ఫాయిదా
  • ఐఆర్‌బీ కంపెనీకి అగ్గువకే లీజుకిచ్చిన రాష్ట్ర సర్కారు
  • ఖజానాకు రూ.15 వేల కోట్లకు పైనే నష్టం
  • మహారాష్ట్రలో 1,014 లేన్​ కి.మీ.లు.. 10 ఏండ్లు.. రూ.8,875 కోట్లు 
  • తెలంగాణలో 1,264 లేన్​ కి.మీ.లు.. 30 ఏండ్లు.. రూ.7,380 కోట్లు
  • ఇప్పుడొస్తున్న దాని కంటే సగానికి పడిపోనున్న రాబడి
  • ఏకంగా 30 ఏండ్లకు లీజు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు
  • టోల్, ఇంటర్ ​చేంజ్‌లు, జంక్షన్ల దగ్గర వందల ఎకరాల ఓఆర్ఆర్​ భూములు
  • అగ్రిమెంట్, టెండర్ వివరాలు బహిర్గతం కాకపోవడంతో 
  • వాటినీ ఇచ్చేశారనే అనుమానాలు

హైదరాబాద్, వెలుగు:  ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌‌ను తక్కువ మొత్తానికే కట్టబెట్టడంపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో సగానికి సగం తగ్గుతున్నా ఒప్పందం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో తక్కువ దూరం, తక్కువ కాలానికి ఎక్కువ మొత్తం చెల్లించి లీజ్ దక్కించుకున్న ఐఆర్‌‌బీ కంపెనీకి.. మన ఓఆర్ఆర్ ఎక్కువ దూరం ఉన్నా, ఎక్కువ కాలానికి.. తక్కువ మొత్తానికే రాష్ట్ర సర్కారు అప్పగించేసింది. దీని వెనుక భారీ గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

టెండర్ల విషయంలోనూ గోప్యతను పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ (టీవోటీ) అగ్రిమెంట్‌‌‌‌లో పేర్కొన్న అంశాలేవి? కేవలం టోల్ మాత్రమేనా? టోల్ పాయింట్లు, జంక్షన్ల దగ్గర ఉన్న ఓఆర్ఆర్ భూములు కూడా రాసిచ్చారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఓఆర్ఆర్ టోల్‌‌‌‌ టెండర్‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 30 ఏండ్లకు ముంబై కంపెనీ ఐఆర్‌‌‌‌బీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌కి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఖజానా నింపేందుకే ఓఆర్ఆర్ టోలింగ్ అప్పగించినట్లు సర్కారు చెబుతోంది. మొన్నటిదాకా ఐదేండ్లకే రూ.4 వేల కోట్ల రాబడి వస్తుందని కేబినెట్ సబ్ కమిటీ పలు దఫాలుగా జరిపిన మీటింగుల్లో చర్చించింది. కానీ ఇప్పుడేమో 30 ఏండ్లకు కలిపి కేవలం రూ.7,380 కోట్లకే అగ్రిమెంట్ కుదుర్చుకుంది. బీఆర్ఎస్ లీడర్ల కోసం మెట్రో రూట్ మార్చినట్లు ఇక్కడ కూడా పెద్దల కోసమే తగ్గించారా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ హంగామా చేస్తూ.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఓఆర్ఆర్ పనికానిచ్చేసింది.

మహారాష్ట్రలో అట్ల.. మన రాష్ట్రంలో ఇట్ల

మహారాష్ట్రలోని ముంబై  పుణె ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే ప్రాజెక్టు, ముంబై–పుణే నేషనల్ హైవే –4 టోలింగ్‌‌‌‌తోపాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్ కోసం ఐఆర్‌‌‌‌‌‌‌‌బీ ఇన్‌‌‌‌ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ 2020లో టెండర్ దక్కించుకున్నది. పదేళ్ల కాలపరిమితికి అంటే 2030 వరకు టీఓటీ చేపట్టనుంది. దీని పరిధి 1,014 లేన్ కిలోమీటర్లుగా ఉన్నది. ఇందుకోసం మహారాష్ట్ర స్టేట్ రోడ్డు డెవలప్​మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ)కి ఏకంగా రూ.8,875 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇందులో రూ.6,610 కోట్లు ఏక మొత్తంలో మొదటి ఏడాదే చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని వరుసగా మూడేండ్లలో కొంత మొత్తం చొప్పున పూర్తిస్థాయిలో చెల్లిస్తున్నది. అదే తెలంగాణలోని నెహ్రూ ఔటర్​ రింగ్ రోడ్డు 1,264 లేన్ కిలోమీటర్లు ఉంది. మహారాష్ట్ర–పుణే ఎక్స్​ప్రెస్ వే కంటే 250 కిలోమీటర్లు ఎక్కువ. ఇక కాలపరిమితి కూడా మహారాష్ట్ర కంటే 20 ఏండ్లు అధికం. అదే తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌కు చెల్లించేది మాత్రం రూ.7,380 కోట్లు మాత్రమే. అమౌంట్ విషయంలోనూ మహారాష్ట్ర కంటే దాదాపు రూ.1,500 కోట్లు తగ్గుతున్నది.

అన్నింటినీ ఊడ్చేస్తున్న రాష్ట్ర సర్కార్

ఓఆర్ఆర్ టోల్ దగ్గర, సైడ్ పాస్​ల దగ్గర, జంక్షన్ల దగ్గర కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో ఎమినిటిస్ క్రియేట్ చేయాలని తొలుత భావించారు. ‘వే టు ఎమినిటిస్’ పేరుతో గతంలో టెండర్లు పిలిస్తే ఎవరూ రాలేదు. ఇప్పుడు టెండర్ వివరాలు, అగ్రిమెంట్‌‌‌‌కు సంబంధించిన విషయాలను ప్రభుత్వం పూర్తిగా వెల్లడించకపోవడంతో ఈ భూములు కూడా ఐఆర్​బీ చేతిలోకి వెళ్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఆదాయం పేరిట ఆస్తులతో పాటు భూములన్నింటినీ రాష్ట్ర సర్కార్ ఊడ్చేస్తోంది. ఒక్కొక్కటిగా వేలం నిర్వహిస్తూ ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ వస్తోంది. లీజుల పేరుతో, కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయంటూ వేలకొద్దీ ఎకరాలు తక్కువ మొత్తానికే ఇచ్చేస్తోంది. ఒక్క గుంట కూడా ప్రభుత్వం పేరిట మిగలకుండా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 58, 59 జీవోల ద్వారా క్రమబద్ధీకరణ పేరుతో పేదలు ఎంత లబ్ధిపొందుతున్నారో దేవుడెరుగు.. కానీ ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు మాత్రం పెద్ద ఎత్తున లాభపడుతున్నారు. సర్కార్ భూములు కబ్జా చేసి కాలేజీలు, లే అవుట్లు చేసి నిర్మాణాలు, హాస్పిటల్స్ కట్టి ఇప్పుడు రెగ్యులరైజేషన్ కింద మేలు పొందుతున్నారు. బీఆర్ఎస్ లీడర్ల భూముల కోసమే ఫలక్​నామా నుంచి కాకుండా రాయదుర్గం నుంచి ఎయిర్​పోర్ట్ మెట్రోకు సర్కారు శంకుస్థాపన చేసిందనే విమర్శలు ఉన్నాయి. 

అన్నేండ్లు ఎందుకు?

రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 30 ఏండ్ల కాలపరిమితి ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందనే దానిపై ఉన్నతాధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ఐదేండ్లు, 10 ఏండ్లు అనుకున్నామని.. కేబినెట్ సబ్ కమిటీ భేటీల్లోనూ అదే చర్చ జరిపామని చెబుతున్నారు. కానీ అనుహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 20 ఏండ్లు ఎక్కువ ఇవ్వడం ఏంటో అంతుచిక్కడం లేదని అంటున్నారు. వాస్తవానికి ఓఆర్ఆర్ లాంటి ప్రాజెక్టులను 10 ఏండ్లలోపే టీఓటీకి ఇస్తేనే రాష్ట్ర సర్కార్​కు మేలుగా ఉంటుంది. ఆ పదేండ్లలో వచ్చిన మార్పులు, పెరిగిన ధరలు, వాహనాల రద్దీకి అనుగుణంగా ఇంకోసారి టెండర్ పిలిస్తే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసుకునేందుకు వీలుంటుంది. ఇప్పటిదాకా నిర్వహిస్తూ వచ్చిన ఏజెన్సీలకు రెండేళ్ల కాలపరిమితితోనే ఇచ్చారు. వచ్చే ప్రభుత్వాలకు ఎలాంటి అవకాశం లేకుండా ఇప్పుడున్న వారికే మేలు జరిగేలా పెద్దల హస్తం ఉందనేది బలంగా వినిపిస్తోంది.

గత ఏడాది 414 కోట్లు.. ఇకపై వచ్చేది 248 కోట్లే

టోల్ వసూలును ఏదో ఒక ఏజెన్సీకి కొంతకాలానికి అప్పగిస్తూ రాష్ట్ర సర్కారే ఓఆర్ఆర్‌‌ నిర్వహణ చూస్తోంది. గతేడాది టోల్​తో సర్కార్​కు రూ.414 కోట్లు వచ్చింది. ఈసారి రూ.500 కోట్లు వస్తుందని అంచనా. ఇలా ఏటా ఈ మొత్తం అంతకంతకు పెరగనుంది. వెహికల్స్​రద్దీ, టోల్ ధర క్రమంగా పెరుగుతుంది. దీంతో 30 ఏండ్లలో దాదాపు రూ.15 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుందని అంచనా. ఐఆర్‌‌బీకి అప్పగించిన దాని ప్రకారం ఇప్పుడు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది కేవలం రూ.248 కోట్లు మాత్రమే. ఇంత తక్కువకు ఓఆర్‌‌ఆర్‌‌ను కట్టబెట్టడంపై ప్రభుత్వ పెద్దలు మౌనం వీడటం లేదు. ఆదాయం కోసమే టీఓటీకి ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా టెండర్ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారనే ప్రశ్నలకు సర్కార్ నుంచి సమాధానం రావడం లేదు.