వాన పడితే.. రాస్తా బంద్!
వరదనీటితో వాహనదారులకు తప్పని ఇబ్బందులు
ఔటర్ పరిధిలో 20 ప్రాంతాల్లో తీవ్రంగా సమస్య
ఆమ్దానీపై ఫోకస్ పెట్టిన హెచ్ఎండీఏ
హైదరాబాద్, వెలుగు : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) అండర్ పాస్‌లు డేంజర్‌గా మారుతున్నాయి. వాన పడితే అండర్ పాస్ లోంచి వెళ్లేందుకు వాహనదారులు భయాందోళ చెందుతున్నారు. వరద నీరు చేరుతుండగా.. ఎంత లోతు ఉందో తెలియక వెనక్కి తగ్గుతున్నారు. కొన్నిచోట్ల రెండు, మూడు ఫీట్ల వరకు నీరు నిలుస్తోంది. మొత్తం158 కి.మీ ఓఆర్ఆర్ పరిధిలో 167 అండర్ పాస్‌లు ఉన్నాయి. వీటిలో దాదాపు 20 చోట్ల వరద నీరు చేరుతుంది. కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులైనా వరద క్లియర్ కావడం లేదు. కొన్నిచోట్ల ఎత్తు తక్కువగా ఉన్నాయి. సర్వీసు రోడ్డు రీ కార్పెటింగ్ చేస్తున్న ప్రతిసారి రోడ్డు ఎత్తు పెరుగుతూ వస్తుండగా అండర్పాస్ లు మరింత లోతులోకి వెళ్లాయి. దీంతో వర్షాలు పడిన వెంటనే వరదనీరంతా అండర్ పాస్‌ల కింద జామ్ అవుతుంది. దీంతో వాటిలోంచి వెళ్లేందుకు వాహనదారులు సాహసం చేయలేక, కాస్త దూరమైన సరే ప్రత్యామ్నాయ రూట్లలో రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ నిర్మించే సమయంలో ఇంజనీరింగ్ లోపంతోనే ఈ సమస్య ఏర్పడిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.అప్పట్లో అన్నిచోట్ల అండర్ పాస్‌లు ఎత్తులో నిర్మించి ఉంటే ఇప్పుడు రాకపోకలు సాఫీగా సాగేవి.
బెంగళూరు ఘటన నేపథ్యంలో..
ఇటీవల వట్టి నాగులపల్లి వద్ద అండర్ పాస్ పనులు జరుగుతుండగా అక్కడ పూర్తిగా వర్షపునీరు చేరింది. అదే టైమ్‌లో కోకాపేట ఎగ్జిట్ నుంచి వట్టినాగులపల్లి వైపు బీఎండబ్ల్యూ కారులో ఉదయ్ తేజ దంపతులు వెళ్తుండగా నీటిలో చిక్కుకుపోయి మధ్యలోనే ఆగిపోయింది. ఎంతసేపు ట్రై చేసినా అందులోంచి బయట పడలేకపోయారు. దీంతో తన ఫ్రెండ్‌కు కాల్ చేసి ఆయన సాయంతో బయటపడ్డారు. ఉదయ్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన భార్య 8 నెలల గర్భిణి అని, తాను అక్కడ చిక్కుకున్నప్పుడు ఎంతో భయపడినట్లు చెప్పాడు. తన బీఎండబ్ల్యూ కారు పూర్తిగా నీటితో మునిగిపోవడంతో రిపేర్లకే దాదాపు రూ.40 లక్షలు అవుతాయని అంచనా వేసినట్లు తెలిపాడు. ఆయన పడిన ఇబ్బందులను ఇలా వ్యక్తం చేశాడు. ఇటీవల బెంగళూరులోనూ భారీ వర్షాలు కురవడంతో అక్కడ అండర్ పాస్‌లో భారీగా నీరు చేరి అందులో ఓ వాహనం చిక్కుకొని ఏపీలోని విజయవాడకి చెందిన ఓ మహిళ మృతిచెందినది తెలిసిందే. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో వర్షాలు కురిసిన టైమ్‌లో అండర్ పాస్‌ల నుంచి వెళ్లేందుకు వాహనదారులు భయపడుతున్నారు.
ఫోకస్ అంతా ఆదాయంపైనే ...
ఓఆర్ఆర్ అండర్‌పాస్‌లతో వాహనదారులు ఇబ్బంది పడుతుండగా హెచ్ఎండీఏ పట్టించుకోకుండా ఆదాయంపైనే ఫోకస్ పెట్టింది. అవసరమైన ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తోంది. ఓఆర్ఆర్ పైకి ఎక్కేందుకు, దిగేందుకు మరిన్ని ప్లాజాలు నిర్మిస్తుండగా.. సర్వీసు రోడ్లపై మాత్రం నిర్లక్ష్యంగా ఉంటోంది. ఇటీవల నార్సింగి వద్ద ఎగ్జిట్‌ను కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి తెచ్చింది. ట్రాఫిక్ రద్దీ పెరిగిందని కొన్నిచోట్ల సర్వీసు రోడ్డును విస్తరిస్తోంది. కానీ, అదే సర్వీసు రోడ్డుపై ఉన్న అండర్ పాస్ లను పట్టించుకోవడం లేదు. 14 ఏండ్ల కింద సరైన ప్లానింగ్, డిజైన్ లేకుండా సర్వీసు రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెరిగిన వాహనాల రద్దీతో ఇబ్బందులు వస్తున్నాయి. ఆదాయం వచ్చే టోల్ రోడ్లపైనే ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తోంది. సర్వీసు రోడ్లను విస్మరిస్తోంది. ఇప్పటికైనా అండర్ పాస్‌ల వద్ద నీరు నిల్వ ఉండకుండా హెచ్ఎండీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ :‘డబుల్’ ఇండ్లను ఆక్రమించినోళ్లను.. ఖాళీ చేయించిన పోలీసులు
చెప్పినా పట్టించుకోవట్లే..
ఓఆర్ఆర్ అండర్ పాసుల్లో వాన నీరు చేరుతుండగా రాకపోకలకు వీలుగా ఉండటం లేదు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదు. సమస్య లేకుండా చేయాలంటే ఓఆర్ఆర్ ని కదిలించాల్సి వస్తోంది. కింద ఎత్తు పెంచాలంటే ఓఆర్ఆర్ పైన కూడా కొద్దిదూరం మార్పులు చేపట్టాలి. అధికారులు అనుకుంటే ఇది సాధ్యమే. కానీ ఖర్చుతో కూడినది కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని వెయిట్ చేయాల్సి ఉంది. ఇటీవల 30 ఏండ్ల పాటు టోల్ -ఆపరేట్ -ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) పద్ధతిలో రూ.7,380 కోట్లకు లీజుకు ఇచ్చారు. ఆ లోపు అండర్ పాస్ పనులు చేస్తే వాహనదారులకు ఇబ్బంది రాదు.
వాన పడితే నీళ్లు చేరుతయ్
చిన్నపాటి వాన పడితే చాలు టీఎస్పీఏ సమీపంలోని ఔటర్ అండర్ పాస్ కింద నీళ్లు చేరుతాయి. అందులోంచి వెళ్లాలంటే భయంగా ఉంటుంది. వానాకాలంలో వానలు పడ్డప్పుడు మూడు నాలుగు రోజులు అండర్ పాస్ లోంచి వెళ్లలేం. దూరం నుంచి ప్రయాణిస్తుంటాం. ఇక్కడ నీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలి.
- మల్లికార్జున్, వాహనదారుడు
నీళ్లు చేరకుండా చేయాలె
ఔటర్‌పై బొంగ్లూర్ జంక్షన్ నుంచి తుక్కుగూడ వెళ్లే రోడ్లో బొంగ్లూర్ సమీపంలో అండర్ పాస్ వద్ద వాన పడ్డప్పుడు నీళ్లు నిలుస్తుంటాయ. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓఆర్ఆర్ డిజైనింగ్ లోపం కారణంగా తలెత్తిన సమస్యకు తొందరగా పరిష్కారం చూపాలి..
కుంట్ల మౌనిక, 2వ వార్డు కౌన్సిలర్, ఆదిబట్ల మున్సిపాలిటీ