తుది దశకు ఓఆర్ఆర్​ వాటర్ ​ప్రాజెక్ట్​ ఫేజ్-2

తుది దశకు ఓఆర్ఆర్​ వాటర్ ​ప్రాజెక్ట్​ ఫేజ్-2
  • వేసవి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు
  • రూ.1200కోట్లతో పనులు..ఆయా ప్రాంతాలకు తీరనున్న నీటి సమస్య

హైదరాబాద్​సిటీ, వెలుగు:  ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు మెట్రోవాటర్​బోర్డు చేపట్టిన ఓఆర్ఆర్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్–2 తుది దశకు చేరింది. రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం వాటర్​బోర్డు అధికారులు ఔటర్​పరిధిలోని ప్రాంతాలకు కూడా తాగు నీరు అందిస్తున్నారు. అయితే, సరైన స్టోరేజీ రిజర్వాయర్లు, పైప్​లైన్లు లేకపోవడంతో డిమాండ్​కు తగ్గట్టుగా నీటిని అందించలేకపోతున్నారు. ఔటర్​ప్రాజెక్ట్​2లో భాగంగా ఆయా ప్రాంతాల్లో 71 సర్వీస్ రిజర్వాయర్ల(138 మిలియన్ లీటర్ల సామర్థ్యం) నిర్మాణాన్ని చేపట్టారు.​ ఇప్పటికే 2,792 కిలో మీటర్ల మేర కొత్త పైపు లైన్ పనులు పూర్తయ్యాయి.

సర్వీస్​రిజర్వాయర్లు కూడా పూర్తయతే వేసవి నాటికి ఓఆర్ఆర్ పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేరనుంది. ఈ ఏరియాలకు అదనంగా మరో 145 ఎంఎల్ డీల నీటిని అందించేందుకు అవకాశం ఉంటుంది. దాదాపు 3.6 లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలగనుంది. 


 
ప్యాకేజీల వారీగా పనులు ఇలా..

ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీల్లో చేపట్టారు. మొదటి ప్యాకేజీలో రూ. 613 కోట్లతో 33 సర్వీస్​రిజర్వాయర్లు, 1,522 కిలోమీటర్ల మేర పైపు లైన్​నిర్మాణం చేపట్టారు. సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్, కీసర మండలాలు ప్యాకేజీ–1 పరిధిలోకి వస్తాయి. దీని పరిధిలో మొత్తం 4.36 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. రెండో ప్యాకేజీలో కొత్తగా 38 సర్వీస్ రిజర్వాయర్లు, 1,270 కిలో మీటర్ల మేర పైపు లైన్​నిర్మాణం చేపట్టారు.

దీని కోసం అధికారులు రూ.587 కోట్లు ఖర్చు చేశారు. రాజేంద్రనగర్, శామీర్ పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఆర్సీపురం, బొల్లారం మండలాలు ప్యాకేజీ–2 పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇది పూర్తయితే 1.96 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.