వైభవంగా భద్రకాళి కల్యాణోత్సవం

హనుమకొండ, వెలుగు:  ఓరుగల్లు  భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీశరన్నరాత్రి మహోత్సవాలు విజయదశమి తెప్పోత్సవం, కల్యాణ మహోత్సవంతో ముగిశాయి. సోమవారం రాత్రి భద్రకాళి చెరువులో హంస వాహనంలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. విజయదశమి కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం ఆలయంలో భద్రకాళీ, భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణం కోసం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో మగ్గం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చీరను నేశారు.

గణపతి దేవాలయం సికింద్రాబాద్​ ట్రస్టీ ఎస్​ఎస్​ జయరాజ్​, గంజి కేదారి ఫౌండేషన్​ పద్మశాలి మేళా కమిటీ చేనేత కళాకారులు రమేశ్​ బృందంతో ఈ గద్వాల చీరను నేసి... కల్యాణ మహోత్సవం కోసం ఆలయ ఈవో శేషుభారతికి అందజేశారు. కాగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయితా గోపినాథ్​ ఆధ్వర్యంలో భద్రకాళీ భక్త సేవా సమితి ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తులంతా కొనియాడారు. కాగా దేవీ నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన దాతలు, నేతలు, ఇతర ప్రముఖులకు ఈవో శేషుభారతి ధన్యవాదాలు తెలిపారు.