వరంగల్, వెలుగు: సద్దుల బతుకమ్మ వేడులకు ఓరుగల్లు రెడీ అయింది. రాష్ట్రానికి బతుకమ్మ పండుగ ఫేమస్ అయితే.. ఓరుగల్లులో సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై ఆటపాటలతో తొమ్మిదో రోజైన సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. ఎంగిలిపూల బతుకమ్మను వెయ్యిస్తంభాల గుడి ఆవరణలో, హనుమకొండలో పద్మాక్షి ఆలయ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ సంబురాలను నిర్వహించేందుకు సంప్రదాయం అనాదిగా వస్తోంది. లక్షలాదిగా మహిళలు, యువతులు తరలివస్తుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా పూలవనంగా మారుతుంది. హనుమకొండ చౌరస్తా నుంచి కిలోమీటర్ దూరంలోని హంటర్రోడ్పై శాయంపేట జంక్షన్ వరకు రద్దీ నెలకొంటుంది. వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో సంబురాల సందర్భంగా ఉర్సు గుట్ట జంక్షన్ నుంచి రెండు వైపులా కిలోమీటర్వరకు ఆటపాటలు ఆడిన అనంతరం మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
నిమజ్జనానికి అధికారుల ఏర్పాట్లు
సద్దుల బతుకమ్మ వేడుకలు సక్సెస్ చేసేందుకు వరంగల్ అధికారులు నాలుగు రోజులుగా ఏర్పాట్లలో బిజీ అయ్యారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే పద్మాక్షి గుడి గుండం, వరంగల్ఉర్సు గుట్ట చెరువుతో పాటు దేశాయిపేట పరిధి చిన్నవడ్డెపల్లి, రంగశాయిపేట బెస్తం చెరువు, గొర్రెకుంట కట్ట మల్లన్న చెరువు, ఖిలా వరంగల్గుండు చెరువు, కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని పెద్ద వడ్డేపల్లి, కాజీపేట బంధం చెరువుతో పాటు తదితర గ్రామాల్లోని చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించారు. బతుకమ్మ తల్లి బిడ్డల విగ్రహాలకు రంగులు వేయించారు. గ్రేటర్మేయర్గుండు సుధారాణి, కమిషనర్అశ్విని ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరంగల్సీపీ అంబర్కిషోర్ఝా బందోబస్తుపై పర్యవేక్షణ చేస్తారు.