ఓరుగల్లు సిటీకి.. అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ

ఓరుగల్లు సిటీకి.. అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ
  •     28న ప్రాజెక్ట్​ పై జిల్లాలోనే రివ్యూ చేయనున్న సీఎం రేవంత్‍రెడ్డి 
  •     ఇప్పటిన మాట ప్రకారం పనులకు అడుగులు
  •     గ్రేటర్‍ వరంగల్లో ఇప్పటికీ ఓపెన్‍ డ్రైన్‍ సిస్టమే.. 
  •     కాంగ్రెస్‍ హయాంలో కేంద్ర మంత్రిగా జైపాల్‍రెడ్డి చొరవ
  •     కేసీఆర్‍ సర్కార్‍ హామీలే కానీ అమలుకు నోచుకోలే..

వరంగల్, వెలుగు: ఓరుగల్లు మహానగర కలల ప్రాజెక్ట్​అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణానికి అడుగులు పడ్తున్నాయి. హైదరాబాద్‍ తర్వాత రెండో రాజధానిగా పిలిచే వరంగల్లోని గ్రేటర్‍ సిటీలో ఇప్పటికీ అండర్‍ డ్రైనేజీ సిస్టం లేదు. ఎక్కడ చూసినా ఓపెన్‍ మోరీలే దర్శనమిస్తున్నాయి. దశాబ్దాలుగా రాజకీయ పార్టీలకు 'అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణం' ఎన్నికల హామీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంతోపాటు పదేండ్ల ప్రత్యేక తెలంగాణలోనూ ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనల్లో మాటలు తప్ప, చేసింది లేదు. కాగా, ప్రస్తుతం ఈ విషయంలో సీఎం రేవంత్‍రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పనులకు అడుగులు వేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ ప్రాజెక్ట్​పై అధికారులతో చర్చించేందుకు సీఎం వరంగల్ రానున్నారు. దీంతో ఇక్కడి జనాల్లో డ్రీమ్‍ ప్రాజెక్ట్​పై ఆశలు చిగురించాయి.

హైదరాబాద్‍ తర్వాత అతిపెద్ద సిటీ.. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍ తర్వాత మరో అతి పెద్ద సిటీ వరంగల్‍ నగరమే. అందుకే ఓరుగల్లును రెండో రాజధానిగా పిలుస్తున్నారు. గ్రేటర్‍ వరంగల్‍ విస్తీర్ణం 407.71 స్వ్కేర్‍ కిలోమీటర్లు ఉండగా, 2.54 లక్షల ఇండ్లు, పాత లెక్కల ప్రకారం 10,48,989 మంది జనాభా ఉన్నారు. 183 స్లమ్‍ ఏరియాలు (92 నోటిఫైడ్, 91 నాన్‍ నోటిఫైడ్‍) ఉన్నాయి. సిటీలో రోడ్ల విస్తీర్ణం 1646 కిలోమీటర్లు కాగా, డ్రైనేజీ వ్యవస్థ 1433.02 కిలోమీటర్లు ఉంది. 42 విలీన గ్రామాలున్నాయి. గ్రేటర్​ సిటీ పరిధిలో వరంగల్, హనుమకొండ రెండు జిల్లాలు ఉండగా, వరంగల్‍ తూర్పు, వరంగల్‍ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‍ ఘన్‍పూర్‍ నియోజకవర్గాలున్నాయి. అభివృద్ధిలో జీడబ్ల్యూఎంసీకి అనుబంధంగా కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) పనిచేస్తోంది.

మసిపూసి మాయ చేసిండు..

గ్రేటర్ వరంగల్‍ సిటీలో అండర్‍ డ్రైనేజీ అంశం రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా పనికిరాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‍ ఓ అస్త్రంగా మార్చుకున్నాడు. 2001 ఉద్యమం మొదలైనప్పటి నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు ఈ అంశంపై విపక్షాలను తిట్టడానికి వాడుకున్నారు. తెలంగాణలో తానే దీనిని నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. 2014లో బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం ఏర్పడగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా 2015లో వరంగల్ వచ్చారు. 

వరంగల్‍ సిటీకి మరోసారి అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈజీఐఎస్‍ సంస్థతో కలిసి డీపీఆర్‍ తయారు చేసి కేసీఆర్‍ కు పంపారు. అనంతరం ఆ ఫైల్‍ మూలకు పెట్టడంతో కేసీఆర్‍ హామీ ఉత్తిముచ్చట్లే అయింది. దీంతో పెరిగిన సిటీ, జనాభాకు అనుగుణంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక, చిన్నపాటి వానలకే వరంగల్‍ ట్రైసిటీ వరదల్లో మునుగుతోంది.

1996లో రూ.110 కోట్లతో ప్రాజెక్ట్​ డీపీఆర్‍

వరంగల్‍ నగరం 1994లో స్పెషల్‍ గ్రేడ్‍ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‍ హోదాకు అప్‍గ్రేడ్‍ అయింది. 1995లో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ అంశం తెరపైకొచ్చింది. అప్పటి కేంద్రమంత్రి జైపాల్‍రెడ్డి ఈ ప్రాజెక్ట్​పై సానుకూలంగా స్పందించారు. 1996లో రూ.110 కోట్ల అంచనా బడ్జెట్​తో డీపీఆర్‍ తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. ఆపై ప్రభుత్వం మారడంతో ఎవరూ పట్టించుకోలేదు. మధ్యలో ఈ ప్రాజెక్ట్​ను కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0లో చేర్చుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే అప్పటికే కేసీఆర్‍ ప్రభుత్వం స్మార్ట్​సిటీ  స్కీంలో రాష్ట్ర వాటాగా సగం నిధులు ఇవ్వకపోవడంతో దానికి సైత్ బ్రేక్‍ పడ్డట్లైంది. 

మాట ప్రకారం 20 రోజుల్లో సీఎం ఓరుగల్లు టూర్‍..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్​రెడ్డి లోక్‍సభ ఎలక్షన్‍ కోడ్‍ ముగిసిన 20 రోజుల్లోనే ప్రాజెక్ట్​ను సీరియస్‍గా తీసుకున్నారు. ఏప్రిల్‍ 24న సీఎం వరంగల్​ సభలో మాట్లాడుతూ వరంగల్‍ నగరం పేరుకే స్మార్ట్​ సిటీగా ఉంది కానీ, ఓపెన్‍ మోరీలు, చెత్తతో అపరిశుభ్రంగా ఉందన్నారు. వరంగల్‍ నగరానికి అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మిస్తామని మాటిచ్చారు. 

ఆపై మే 7న నిర్వహించిన రెండో దఫా ప్రచారంలో అండర్​ గ్రౌండ్‍ డ్రైనేజీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎలక్షన్ల తర్వాత జిల్లాకు వచ్చి రోజంతా అధికారులతో సమావేశం నిర్వహించి, తానే అభివృద్ధి విషయంలో జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పారు. అన్నమాట ప్రకారం ఈ నెల 28న సీఎం రేవంత్‍రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నారు. కలల ప్రాజెక్ట్​పై రివ్యూ చేయబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.