పార్టీలకు ఓరుగల్లు సెంటిమెంట్ .. మెజారిటీ సీట్లు సాధిస్తే ప్రభుత్వం ఏర్పడినట్లే

  • క్యూ కడుతున్న మూడు పార్టీల అగ్ర నేతలు
  • ఇప్పటికే సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి వరుస సభలు
  • 17న రాహుల్ గాంధీ, 18న అమిత్ షా రాక
  • అదేరోజు పరకాలలో కేసీఆర్ బహిరంగ సభ

హనుమకొండ, వెలుగు : రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక పేరున్న ఓరుగల్లుపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఇక్కడి నియోజకవర్గాల్లో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంట్ ఉండడంతో బీఆర్ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ ఉమ్మడి జిల్లాలో పాగా వేసేందుకు పోటీ పడుతున్నాయి. ఆ మూడు పార్టీల అగ్ర నాయకులు వరంగల్​ బాట పడుతున్నారు. ప్రచార సభలు నిర్వహిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్​అధినేత సీఎం కేసీఆర్​ వరుసగా ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి కూడా వరంగల్​పై ఫోకస్​పెట్టి విజయభేరి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కాగా ఈనెల 17న రెండు పార్టీల అగ్ర నాయకులు ఓరుగల్లు గడ్డపై అడుగు పెట్టనున్నారు. కాంగ్రెస్​ నుంచి రాహుల్ గాంధీ, బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్​ 17న ఉమ్మడి వరంగల్​ జిల్లాలో జరిగే వివిధ సభల్లో పాల్గొననున్నారు. 

లాస్ట్​ ఎన్నికల్లో అదే సీన్​ రిపీట్​

ఉమ్మడి వరంగల్​జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందనే సెంటిమెంట్ నడుస్తోంది. గత మూడు, నాలుగు టర్మ్​ లు పరిశీలించినా అదే విషయం స్పష్టమవుతోంది. 2004లో ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్​ ఆరు, కాంగ్రెస్​ ఐదు, టీడీపీ రెండు స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్  గెలుచుకున్న స్థానాల్లో జనగామ, వరంగల్, శాయంపేట, డోర్నకల్, ములుగు నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇక టీఆర్ఎస్​ స్టేషన్​ ఘన్ పూర్​, చేర్యాల, పాలకుర్తి, నర్సంపేట, పరకాల, హనుమకొండ నియోజకవర్గాలు గెలుచుకోగా.. టీడీపీ మహబూబాబాద్, వర్ధన్నపేట స్థానాలను దక్కించుకుంది. అయితే, ఆ సంవత్సరంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల కూటమితో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడింది. ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాలను కాంగ్రెస్​ కైవసం చేసుకోగా.. నాలుగు టీడీపీ, మరో స్థానాన్ని టీఆర్ఎస్​ గెలుచుకుంది.

అత్యధికంగా ఏడు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్​ 8, టీడీపీ 2, మరో రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. అధిక సీట్లు టీఆర్ఎస్​ సొంతం కాగా అదే పార్టీ గవర్నమెంట్  ఫామ్ చేసింది. చివరగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత బీఆర్ఎస్  పార్టీ ఏకంగా 10 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. భూపాలపల్లి, ములుగు అసెంబ్లీ స్థానాలను గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్క గెలుచుకోగా.. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గండ్ర పార్టీ మారి బీఆర్ఎస్​ లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ బలం 11 స్థానాలకు చేరుకోగా..అదే పార్టీ స్టేట్​లో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

17న రాహుల్​గాంధీ.. ​18న అమిత్ షా

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఓరుగల్లు సెంటిమెంట్​ను వర్కవుట్​ చేసేందుకు అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. ఈ దిశగా వరంగల్ పై అన్ని పార్టీలు దృష్టి పెట్టగా.. ఆయా పార్టీల అగ్ర నేతలు ఇదే వారంలో ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టేందుకు వస్తున్నారు. ఈనెల 17న వరంగల్  తూర్పుతో పాటు పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించే కాంగ్రెస్​ విజయభేరి సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ హాజరు కానున్నారు. ఆయన వెంట పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంకా గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి తదితరులు పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

అలాగే అధికార బీఆర్ఎస్​ కూడా ఈనెల 17న  పరకాలలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుండగా.. ఆ సభలో సీఎం కేసీఆర్​ పాల్గొననున్నారు. ఇక తర్వాతి రోజే (18న) వరంగల్  తూర్పులోనే బీజేపీ నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్  షా హాజరు కానున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మూడు పార్టీల అగ్ర నాయకుల కార్యక్రమాలు ఉండడంతో ఆయా పార్టీల నాయకులు సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాపై పట్టు నిలుపుకొనేందుకు బీఆర్ఎస్​ ప్రయత్నం చేస్తుండగా.. కాంగ్రెస్​, బీజేపీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చివరకు ఏ పార్టీకి ఉమ్మడి జిల్లా ప్రజలు పట్టం కడతారో.. ఓరుగల్లు మెజారిటీ సీట్ల సెంటిమెంట్ ఈసారి ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

మూడు పార్టీల ఆరాటం

గడిచిన నాలుగు టర్మ్​లు పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాలో అత్యధిక ​ సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే సెంటిమెంట్  ఏర్పడింది. దీంతో అదే సెంటిమెంట్​ను అందిపుచ్చుకునేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. చిన్న పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో హోరాహోరీ తలపడుతున్నాయి. అధికార బీఆర్​ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువ సీట్లు కొట్టేందుకు ప్లాన్​ చేస్తున్నాయి.

ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తూ మహిళలు, యూత్​ ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే వర్ధన్నపేట, నర్సంపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్​ ప్రచార సభలు నిర్వహించగా.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి కూడా స్టేషన్  ఘన్​ పూర్​, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఇదే వారంలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​, బీజేపీల అగ్రనాయకులు ఓరుగల్లులో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు రానున్నారు.