ఆస్కార్ వచ్చిందని భూమి ఇచ్చారు.. ఇళ్ళు కట్టుకున్నాక కూల్చేస్తాం అంటున్నారు

ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. వాటి కూల్చివేత కార్యక్రమం ఇటీవల మొదలైంది. ఇందులో భాగంగానే ఆస్కార్ విజేత పింకి సొంకర్(Pinky sonkar) ఇంటి కూల్చివేతకు కూడా నోటీసులు జారీ చేశారు ఉత్తర్ ప్రదేశ్ అటవీ శాఖ అధికారులు.  ప్రస్తుతం ఈ వార్త నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. 

అసలు విషయం ఏంటంటే.. ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా ధాబీ గ్రామంలో కొంతమంది అక్రమంగా అటవీ స్థలాన్ని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టారని..  పింకి సొంకర్ తోపాటు మరికొందరు గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు నోటీసుకు పంపారు. సెప్టెంబర్ 21న తమ ఇళ్ళు కూల్చనున్నామని నోటీసులో తెలిపారు. ఇదే విషయంపై పింకి సోంకర్ తండ్రి రాజేంద్ర సొంకర్ స్పందిస్తూ..  ఇంటి నిర్మాణ సమయంలో అధికారులు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని, పింకి సోంకర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గాను అధికారులు ఇచ్చిన భూమిలోనే తాము ఈ ఇంటిని నిర్మించామని తెలిపారు. కాగా.. పింకి తండ్రి రాజేంద్ర సొంకర్ అభ్యంతరాలపై మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ స్పందించారు. ఈ విచారణ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశామని, న్యాయబద్దంగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

ఇక పింకి సొంకర్ విషయానికి వస్తే.. మీర్జాపూర్ రాంపూర్ గ్రామానికి చెందిన ఆమె 2008 లో స్మైల్ పింకీ డాక్యుమెంటరీలో నటించింది. ఈ డాక్యుమెంటరీలో ఆమె నటనకు ఆస్కార్ అవార్డు వచ్చింది. పింకి సొంకర్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీతో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది.