2024 సంవత్సరానికి గాను పొన్నం సత్తయ్య గౌడ్ స్మారక అవార్డుకు ఆస్కార్ అవార్డు గ్రహీత, సినీగేయ రచయిత చంద్రబోస్.. బలగం సినిమా ఫేమ్ కొమురమ్మ, మొగిలియ్యలు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 13న అనగా శుక్రవారం పొన్నం సత్తయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా రవీంద్రభారతి వేదికగా వీరికి అవార్డులు అందజేయనున్నారు.
అవార్డు గ్రహీతలను రూ.51,000 చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరుకానున్నారు.
పొన్నం సత్తయ్య గౌడ్
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య గౌడ్ స్మారక అవార్డులు ప్రధానం చేస్తారు. సాహిత్య, కళారంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వారిని జల్లెడ పట్టి అవార్డులు అందజేస్తారు.
గతంలో విజేతలు
ఇప్పటివరకూ ఈ అవార్డును రెండు సార్లు ప్రధానం చేయగా.. ప్రథమ ఏడాది రచయిత విభాగంలో నాళేశ్వరం శంకర్, కళాకారుల విభాగంలో ఒగ్గు కథ ధర్మయ్యలు అందుకున్నారు. అనంతరం రెండో ఏడాది రచయిత విభాగంలో నెలిమాల భాస్కర్, కళాకారుల విభాగంలో ప్రముఖ జానపద గాయని విమలక్క ఈ అవార్డును అందుకున్నారు.