
- ఇండియన్ షార్ట్ ఫిల్మ్‘అనూజ’కు నిరాశ
ఇరవై మూడేండ్ల ఓ వేశ్య చుట్టూ సాగే ‘అనోరా’ సినిమాకు ఆస్కార్ అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో ఐదు పురస్కారాలు వరించాయి. 97వ అకాడమీ అవార్డుల వేడుక సోమవారం లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. ‘అనోరా’లో లీడ్ రోల్ చేసిన మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా, ‘ది బ్రూటలిస్ట్’ మూవీలో నటించిన అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
ఆస్కార్ అవార్డుల్లో ఈసారి ఇండియాకు నిరాశే మిగిలింది. భారత్ నుంచి ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒక్క సినిమా కూడా తుది నామినేషన్లలో నిలవలేదు. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మాత్రం ‘అనూజ’ ఎంట్రీని దక్కించుకున్నప్పటికీ అవార్డు దక్కలేదు.
సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని నటీనటులు, టెక్నీషియన్స్ ఎదురుచూస్తుంటారు. అలాంటి 97వ అకాడమీ అవార్దుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఉత్తమ చిత్రంగా ‘అనోరా’ నిలిచింది. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), ఉత్తమ నటిగా మికీ మ్యాడిసన్ (అనోరా) నిలిచారు. ‘డ్యూన్: పార్ట్ 2’ ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.
‘ది బ్రూటలిస్ట్’ చిత్రం ఉత్తమ నటుడితో పాటు సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లోనూ అవార్డులు గెలుచుకుంది. మన దేశం తరపున ఆస్కార్ బరిలో నిలిచిన ‘అనూజ’ చిత్రానికి నిరాశ ఎదురైంది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం పోటీ పడగా, ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ చిత్రాన్ని ఆస్కార్ వరించింది.
సెక్స్ వర్కర్స్‌పై గౌరవం పెంచే ‘అనోరా’
ఆస్కార్ వేదికపై నాలుగు అవార్డులు అందుకన్న వ్యక్తిగా సీన్ బేకర్ రికార్డు క్రియేట్ చేశాడు. ‘అనోరా’ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ కేటగిరీస్‌లో సీన్ బేకర్ నాలుగు అవార్డులు అందుకున్నాడు. అలాగే ఉత్తమ నటి అవార్డు కూడా ఈ చిత్రానికే దక్కింది. అని అనే 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరిగే కథ ఇది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసావ్ లీడ్ రోల్స్‌లో నటించారు. రష్యాకు చెందిన వన్య అనే కోటీశ్వరుడైన కుర్రాడు అమెరికాలో అనోరా అనే సెక్స్ వర్కర్‌ను కలుసుకుని వారం పాటు తనతో ఉండేందుకు హైర్ చేసుకుంటాడు.
కానీ కొన్ని రోజులకే ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. రష్యాలో ఉండే అతని పేరెంట్స్‌కు అది నచ్చక, తమ కొడుకుని వదిలేయమంటూ ఆమెపై వత్తిడి తెస్తారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథ. వేశ్యలను చిన్నచూపు చూడొద్దు అనే సందేశంతో తెరకెక్కించారు. ‘అనోరా’ అనే లాటిన్ పదానికి ‘గౌరవం’ అని అర్థం. తమ కథలను, వ్యథలను తనతో పంచుకున్న వేశ్యలకు థ్యాంక్స్ చెబుతూ.. ఆస్కార్ అవార్డును వాళ్లతో షేర్ చేసుకుంటానని దర్శకుడు సీన్ బేకర్ తన స్పీచ్‌లో చెప్పాడు.
ఆస్కార్ వేదికపై హిందీ
హోస్ట్‌గా వ్యవహరించిన కానన్ ఓ బ్రెయిన్.. ‘భారత ప్రజలకు శుభోదయం. ఈవెంట్ జరిగే సమయం మీకు ఉదయం కదా.. అందరూ అల్పాహారం తింటూ ఆస్కార్ వేడుక చూడండి’ అని హిందీలో వెల్ కమ్ స్పీచ్ ఇచ్చాడు.
విజేతలు వీరే..
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్- జోయ్ సాల్దానా (ఎమిలియా పెరెజ్)
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే- సీన్ బేకర్ (అనోరా)
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్- పాల్ తాజ్‌వెల్ (వికెడ్)
- బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్- ది సబ్‌స్టాన్స్
- బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్- ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
- బెస్ట్ ఎడిటింగ్- సీన్ బేకర్ (అనోరా)
- బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్- ది సబ్ స్టాన్స్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్- విక్డ్
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్- డ్యూన్ 2
- బెస్ట్ సౌండ్- డ్యూన్ 2
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- ఫ్లో
- బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
- బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- నో అదర్ ల్యాండ్
- బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ఐయామ్ నాట్ ఏ రోబోట్
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్- ఎల్ మల్
స్పెషల్ అట్రాక్షన్
పాప్ సింగర్, హాలీవుడ్ నటి సెలీనా గోమేజ్ అవా ర్డుల వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిం ది. పద హారు వేల క్రిష్టల్స్‌తో స్పెషల్‌గా డిజైన్ చేసిన రోజ్ గోల్డ్ గౌనులో హాజరైన ఆమె అందరినీ ఆకట్టుకుంది.
మళ్లీ ముద్దాడి..
బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అందుకున్న అడ్రియాన్ బ్రాడీ.. 2003లో ‘ది పియానిస్ట్’ చిత్రానికి ఆస్కార్ అందుకున్నప్పటి సీన్‌ను రీ క్రియేట్ చేశాడు. అప్పట్లో అవార్డును అందజేసిన బెర్రీని ముద్దాడిన అడ్రియాన్.. ఈసారి రెడ్ కార్పెట్‌పై హాలీ బెర్రీని ముద్దాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.