- ఓజీహెచ్ జేఏసీ చైర్మన్ పాండు నాయక్
బషీర్ బాగ్, వెలుగు : ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ నిర్మించాలని ఓజీహెచ్(ఉస్మానియా జనరల్ హాస్పిటల్) జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. కొత్త బిల్డింగ్ వెంటనే నిర్మించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ పాండు నాయక్ మాట్లాడుతూ 105 ఏండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా హాస్పిటల్ లో సరైన వసతులు లేక పేషెంట్లు, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 3 వేల బెడ్లు అవసరం ఉండగా.. ప్రస్తుతం 4 వందల బెడ్లపై పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ లో భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నామన్నారు.
2018 లో జేఏసీ గా కొత్త బిల్డింగ్ కోసం 100 రోజులు నిరసనలు చేపడితే ... రూ. 800 కోట్లతో ట్విన్ టవర్స్ నిర్మిస్తామని అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని దాటివేత ధోరణి అవలంభిస్తుందని మండిపడ్డారు. పాత బిల్డింగ్ కూల్చి కొత్త బిల్డింగ్ కట్టాలని... లేకపోతే హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 7 ఎకరాల భూమిలో అయిన కొత్త బిల్డింగ్ కట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై వారం రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని... లేదంటే కొత్త బిల్డింగ్ సాధనకు పోరాడుతామని ఆయన హెచ్చరించారు.
గోడ పెచ్చులు ఊడి పడుతున్నయ్
ఉస్మానియా హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న నర్సింగ్ స్టూడెంట్స్ హాస్టల్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పురాతన భవనం కావడంతో గోడల పెచ్చులు ఊడి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడు రూముల్లోకి నీళ్లు కారుతున్నాయన్నారు. ఒక్కోసారి కరెంట్ స్విచ్ ఆన్ చేసేప్పుడు షాక్ లకు గురవుతున్నట్లు వివరించారు. రూమ్ కు ఆరుగురు ఉంటూ సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని తమకు వేరే చోట హాస్టల్ నిర్మించాలని నర్సింగ్ విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు.