- స్టాండింగ్ కమిటీ సమావేశంలో 9 అంశాలకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బుధవారం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఆరో స్టాండింగ్ కమిటీ సమావేశంలో తొమ్మిది అంశాలు, ఒక టేబుల్ ఐటమ్ కు సభ్యులు ఆమోదం తెలిపారు. నాంపల్లిలోని పోలీస్ క్వార్టర్స్, గోషామహల్ బంక్, స్టేడియం, బాస్కెట్ బాల్, బాడ్మింటన్ కోర్టులకు సంబంధించిన 31.39 ఎకరాల భూమిలో ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి ఎన్ఓసీ జారీ సిఫారసుకు ఆమోదం తెలిపారు. డివిజన్ స్థాయిలో క్రీడా పోటీలు, ఇతర క్రీడా కార్యక్రమాలు నిర్వహించేలా ఒక్కో కార్పొరేటర్‌కు రూ.2 లక్షల విలువైన క్రీడా సామగ్రిని అందించే అంశాన్ని ఆమోదించారు.
నాగమయ్యకుంట నాలా పొడిగింపులో భాగంగా బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఓకే చెప్పారు. రూ.3 కోట్ల పనులను ఆమోదించారు. హబీబ్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట మెయిన్ రోడ్, రియాసత్ నగర్ నుంచి హబీబ్ నగర్ వయా పాపాలాల్ టెంపుల్ వరకు రోడ్డు డెవలప్మెంట్కు 174 ఆస్తులు సేకరించాలని నిర్ణయించారు. మల్లేపల్లి మోడల్ మార్కెట్ బిల్డింగ్ సమీపంలోని నిరుద్యోగ యువతకు, మహిళలకు సీఎస్ఆర్ కింద లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిధులతో సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లవ్లీ హుడ్ ప్రోగ్రాం నిర్వహించడానికి, ఏడాది పాటు మల్లేపల్లి మోడల్ మార్కెట్ బిల్డింగ్ ను స్వాధీనం చేయడానికి అనుమతిస్తూ సంబంధిత ఏజెన్సీ తో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూ చేయడానికి ఆమోదం తెలిపారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలలకి సంబంధించిన ఆదాయ, వ్యయాలను, సికింద్రాబాద్ జోన్ లో కంప్యూటర్ఆపరేటర్అదనపు పోస్టు మంజూరును ఆమోదించారు. అలాగే కార్పొరేటర్ల హెల్త్ ఇన్సూరెన్స్ గడువును మరో ఏడాది పొడిగించారు. దీని కోసం ఒక కమిటీని నియమించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి, స్టాండింగ్ కమిటీ సభ్యులు , అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు.